iDreamPost
iDreamPost
రాష్ట్ర విశాల ప్రయోజనాలను, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు సంఘీభావంగా అఖిలపక్ష పోరాటానికి బీజం పడింది. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు స్వయంగా దీనికి కంకణం కట్టుకున్నారు. తన నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా పలాసలో దీనికి అంకురార్పణ చేశారు. రాష్ట్రానికి విశాఖపట్నం ఏకైక రాజధాని అవ్వాలన్నది తన వ్యక్తిగత ఆకాంక్ష అని.. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న సత్సంకల్పంతో సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు ఉత్తరాంధ్ర వాసులందరూ సంఘీభావం ప్రకటించి జగన్ కు మద్దతుగా నిలవాలని మంత్రి అప్పలరాజు పిలుపునిచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీలు డిమాండ్ చేయడం అనుచితమని.. తద్వారా ఆ పార్టీలన్నీ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా పలాసలో మంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
Also Read : ఈనాడు రాజకీయ జర్నలిజం కొనసాగుతోంది
జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తాం
అమరావతి పేరుతో కొన్ని రోజులుగా జరుగుతున్న హడావుడి ఒక పార్టీ, ఒక సామాజికవర్గ సంకుచిత ప్రయోజనాల కోసమేనని మంత్రి సీదిరి ఆరోపించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించిన తరుణంలోనే.. ఉత్తరాంధ్రలో మంత్రి సీదిరి ఆ చొరవ తీసుకున్నారు. సీఎం జగన్ ఆశయానికి అండగా నిలిచారు. మూడు రాజధానులు కావాల్సిందే.. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనంటూ తానే ఉత్తరాంధ్ర గళమై నినదించారు. తన నియోజకవర్గ కేంద్రంలోనే పార్టీలు, మేధావులు, పాత్రికేయ ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ రాజధాని అయితే మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, జిల్లా నుంచి వలసలు తగ్గుతాయని అన్నారు. అందువల్ల జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన పలాసలోనే మూడు రాజధానుల సంఘీభావ పోరాటానికి బీజం వేశారు. ఈ ఉద్యమాన్ని ఊరూవాడా విస్తరించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలన్నారు. ఉద్యమ నిర్మాణ, నిర్వహణకు తన వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములై మూడు రాజధానులను సాధించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
Also Read : అమరావతి సభకు సీపీఎం ఝలక్, అందుకే రాలేకపోతున్నామంటూ బహిరంగ లేఖ
మరో హైదరాబాద్ కావద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు హైదరాబాదును ఏకైక రాజధానిగా చేసి.. రాష్ట్ర ఆదాయాన్ని అక్కడ పెట్టుబడులుగా పెట్టి గత పాలకులు అభివృద్ధిని అక్కడే కేంద్రీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో దాని వల్ల నష్టం ఏమిటో తెలిసొచ్చింది. హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయి అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడంతోపాటు ఎంతో ఆదాయాన్ని కోల్పోయింది. అయినా గుణపాఠం నేర్చుకోని గత టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించి లక్షల కోట్లు గుమ్మరించేందుకు సిద్ధపడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు రాజధానులు చట్టం తీసుకొచ్చింది. అన్ని వసతులు ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. దీనివల్ల అమరావతిలో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతో చంద్రబాబు అమరావతి పరిరక్షణ అనే ప్రాయోజిత ఉద్యమాన్ని మొదలుపెట్టించారు. తద్వారా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా మోకాలడ్డుతున్నారన్న అసంతృప్తి ఉత్తరాంధ్ర వాసుల్లో పెరిగింది. వారి ఆకాంక్షలను ఉద్యమ రూపంలోకి మలిచి.. బలంగా వినిపించగలిగే చొరవ నాయకుల్లో లోపించింది. ఈ తరుణంలో ఉత్తరాంధ్రవాసిగా, విశాఖలోనే చదువుకున్న నేతగా.. మంత్రి సీదిరి అప్పలరాజు ముందుకొచ్చారు. మూడు రాజధానులే ముద్దు అన్న నినాదాన్ని వాడవాడలా వినిపించేందుకు ఆయన నడుం కట్టడంపై ఉత్తరాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటంలో తాము కూడా భాగస్వాములు అవుతామని స్పష్టం చేస్తున్నారు.
Also Read : మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి