ఇసుక విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు తెదేపా నేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు విమ్మర్శలు చేస్తున్నారని రహదారులు భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని కృష్ణదాస్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి లో ఇసుకరీచ్ ని ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎవరైనాసరే తాను ఒక్కరూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల పేరుతొ గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని ఆరోపణలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కాగా వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మూతపడిన ఇసుక రీచ్ లను తిరిగి ప్రారంభిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత తీర్చేవిధంగా నవంబర్ 14 నుండి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుండి 180కు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నవంబర్ 14 న ఇసుక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.