Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఇటీవల రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ అని తేలింది. అయితే నాలుగు రోజుల నుంచి కరోనా సంబంధిత లక్షణాలు కనిపిస్తుండడంతో పరీక్ష చేయించుకోగా వైరస్ సోకినట్లు తేలిసింది. దీంతో బాలినేని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులకు కూడా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆయన కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఏపీలో ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన ఎస్.కోట, కోడుమూరు, పొన్నూరు, కడప, శ్రీశైలం, సూళ్లూరుపేట, సత్తనపల్లి, బాపట్ల ఎమ్మెల్యేలకు వైరస్‌సోకగా వీరిలో పలువురు కోలుకున్నారు. మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రోజుకు దాదాపు 10 వేల మందికి వైరస్ సోకుతుండగా.. అదే సంఖ్యలో బాధితులు కోలుకుంటున్నారు. నిన్నటి వర కు రాష్ట్రంలో 21.75 లక్షల మందికి పరీక్షలు చేయగా.. 1.76 లక్షల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 95 వేల మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 1604 మంది ప్రాణాలు కోల్పోయారు.