iDreamPost
iDreamPost
ఆడలేక మద్దెల ఓడె అన్నట్టుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. పంచాయతీ, పరిషత్తు, మునిసిపల్, ఉప ఎన్నికలు పోటీ ఏదైనా గెలుపు వైఎస్సార్ సీపీదే అని పదే పదే రుజువు అవుతుండడంతో బెంబేలెత్తుతోంది. అందుకే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అప్పుడే ఎన్నికల ప్రక్రియలో తాము కొన్ని లోపాలు గుర్తించినట్టు బిల్డప్ ఇస్తోంది. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలంటూ డ్రామా..
స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరడం ద్వారా అప్పుడే రాజకీయం మొదలెట్టేసింది. గత పరిణామాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవాలని కోరింది. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులను సాక్షులుగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు ఆ లేఖలో కోరారు. నామినేషన్ పత్రాలు స్కాన్ చేసుకుని సంబంధిత అధికారులకు అభ్యర్థులు ఈ-మెయిల్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ తరహా విజ్ఞాపన ద్వారా ఇంతకు ముందు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏవో అరాచకాలు జరిగిపోయినట్టు, అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి తాము సూచనలు చేస్తున్నట్టు జనాన్ని నమ్మించాలని వారి ప్రయత్నం. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేయడానికి కూడా వీలు లేకుండా అధికార పార్టీ బెదిరిస్తోందని టీడీపీ హై డ్రామా నడిపింది. అనుంగు మీడియా దాన్ని రక్తి కట్టించింది. అదంతా నిజమేనని, రాష్ట్రంలో ఇప్పటికి అవే పరిస్థితులు ఉన్నట్టు పరోక్షంగా అధికారులను కూడా నమ్మించడానికి ఈ లేఖను కుట్ర పూరితంగా రాశారు.
Also Read : Nellore Corporation Elections – సింహపురి పోరు.. ఈ సారి ఏం జరగబోతోంది..?
వలంటీర్ల జోక్యం లేకుండా చూడాలట!
ఈ ఎన్నికల్లో వలంటీర్ల జోక్యం లేకుండా నిఘా పెట్టాలని, బలవంతపు ఏకగ్రీవాలను పరిగణనలోకి తీసుకోరాదని ఆ లేఖలో కోరారు. సవరించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలన్నారు. అంటే గత ఎన్నికల్లో గ్రామ/వార్డు వలంటీర్లు విచ్చలవిడిగా స్థానిక ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసేసుకొని వైఎస్సార్ అభ్యర్థులను దగ్గరుండి గెలిపించేశారా? అప్పట్లో సరైన నిఘా లేకపోవడం వల్ల వలంటీర్లు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేశారా? బలవంతపు ఏకగ్రీవాలకు అధికారులు అప్పట్లో వంత పాడడం వల్లే వైఎస్సార్ సీపీ గెలిచిందా? సవరించిన ఓటర్ల జాబితా కూడా రాజకీయ పార్టీలకు అందుబాటులో సైతం ఉంచకుండా గతంలో ఎన్నికలు నిర్వహించారనే అర్థం వచ్చేలా లేఖ రాశారు. ఈ మాత్రం స్టఫ్ ఉంటే చాలు మిగతా పనిని తమ మీడియా చక్క బెట్టేస్తుంది. అందుకే ఈ విధంగా ఎన్నికల కమిషనర్కు ఆయన బాధ్యతలు గుర్తు చేస్తున్నట్టు పైకి బిల్డప్ ఇస్తూ తన మీడియాకు మరోపక్క మేతను అందించడం.
ముందస్తు వ్యూహం..
కోవిడ్ తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాలు పెంచాలని, గతసారి చోటు చేసుకున్న హింసాకాండ, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారుల తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని ముక్తాయించి లేఖను ముగించారు. పైన పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటి పాటించక పోయినా అదిగో ఎన్నికల కమిషనర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని రాద్దాంంతం చేయడానికి బాగుంటుంది. వీటిలో కొన్నింటిపై చర్యలు తీసుకున్నా మేము చెప్పాం కాబట్టి ఎన్నికల కమిషనర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అని పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది.కేవలం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి, ఎన్నికల కమిషనర్కు ముందు ముందు దురుద్దేశాలు ఆపాదించి రచ్చ చేయడానికి ఉపయోగ పడుతుంది. అన్నింటికీ మించి రేపు ఎన్నికల్లో ఓడిపోయినా సాకుగా ఈ లేఖలో అంశాలు అక్కరకు వస్తాయి. ఆ విధంగా ముందస్తు వ్యూహంలో భాగంగానే సదరు లేఖను రూపొందించారు.
ఎన్నికల నోటిఫికేషన్ దశలోనే టీడీపీ ఇలాంటి ఎత్తుగడలను ఆశ్రయిస్తోందంటే ముందు ముందు ఇంకేం చేస్తుందో?
Also Read : Election Notification – మినీ స్థానిక పోరుకు నగారా మోగింది