iDreamPost
iDreamPost
లేఖిమ్ పూర్ ఖేరి ఘటన భారతీయ జనతాపార్టీ పరువును మంటగలపడమే కాకుండా.. అంతర్గతంగానూ కుదిపివేస్తోంది. యూపీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను కాపాడుతోందన్న విమర్శలకు తోడు సొంత పార్టీలోనూ నిరసన గళం వినిపిస్తుండగా.. ఆ గళాలను నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. దాని ఫలితంగానే పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీలో కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ, ఆమె తనయుడు, ఎంపీ వరుణ్ గాంధీ చోటు కోల్పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పార్టీపై వరుణ్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు. వ్యవసాయ చట్టాలు, మరికొన్ని ఇతర అంశాల్లో పార్టీతో విభేదిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధం కావచ్చన్న చర్చ తెరపైకి వచ్చింది.
లఖిమ్ పూర్ ఘటనపై వరుస ట్వీట్లు
మొన్న ఆదివారం యూపీలోని లఖిమ్ పూర్ ఖేరిలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహిస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారుతో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతో సహా తొమ్మిదిమంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మంత్రి తనయుడే ఈ దారుణానికి తెగబడ్డాడని రైతులు ఆరోపిస్తుండగా.. ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని కేంద్రమంత్రి వాదిస్తున్నారు. పైగా రైతులు మొదట రాళ్లు విసరడంతో కారులో ఉన్న తమ కార్యకర్తలు భయపడి వేగం పెంచడంతోనే ఈ దుర్ఘటన జరిగిందన్న వాదనను తెరపైకి తెచ్చారు.
Also Read : బీజేపీని ఖాళీ చేస్తామంటున్న మంత్రి
సంఘటనను అదే రోజు తీవ్రంగా ఖండించిన బీజేపీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా గురువారం మరో వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో సంఘటన జరిగిన తీరు చాలా స్పష్టంగా ఉందని.. రైతులు రాళ్లు వేసినట్లు లేకపోగా కారును కావాలనే ఆందోళనకారులపైకి ఉరికించినట్లు కనిపిస్తోందని ట్వీట్ చేశారు. అమాయక రైతుల మరణాలకు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. హత్యలతో ఆందోళనకారుల నోళ్లు మూయించలేరని కూడా వ్యాఖ్యానించారు. వరుణ్ పెట్టిన వీడియో, చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కూడా వరుణ్ గాంధీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలని రైతులు నెలల తరబడి చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. పలు సందర్భాల్లో రైతు ఉద్యమానికి మద్దుతుగా మాట్లాడారు. ఇవన్నీ బీజేపీ నాయకత్వాన్ని సంకట స్థితిలోకి నెట్టేశాయి. వరుణ్ గాంధీని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. తొలి చర్యగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు లేకుండా చేశారు. ఆయనతో పాటు అతని తల్లి, కేంద్ర మాజీమంత్రి మేనకా గాంధీని కూడా తప్పించారు.
Also Read : కాంగ్రెస్, బీజేపీల నేతలు టీఎంసీలోకి ఎందుకు వెళుతున్నారు..?
తల్లీకుమారులు ఏం చేస్తారో?
మేనకాగాంధీ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.1989 నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె ప్రస్తుతం సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. జనతాదళ్, వాజపేయి ప్రభుత్వాల్లో పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె 2014-19 కాలంలో మోదీ క్యాబినెట్లోనూ సభ్యురాలిగా ఉన్నారు. అయితే ఎన్డీయే-2 ప్రభుత్వంలో ఆమెను తీసుకోలేదు. మరోవైపు 2009 నుంచి ఎంపీగా కొనసాగుతున్న, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేసిన మేనక తనయుడు వరుణ్ గాంధీకైనా అవకాశం ఇవ్వలేదు. దాంతో వారిలో సహజంగానే కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు లఖిమ్ పూర్ ఘటనలో పార్టీని ఇరుకున పెడుతున్నారన్న నెపంతో జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం వరుణ్ గాంధీలో అసంతృప్తిని మరింత పెంచుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన వేరు మార్గం చూసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే ఐదు నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనిపిస్తోంది.
Also Read : ఝున్‌ఝున్‌వాలా భేటీల వెనుక కారణాలు ఏంటి?