మేఘా బ్రాండ్ అంటే తెలియనిది ఎవరికీ? దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇంజినీరింగ్ సంస్థ గొప్ప చరిత్ర కలిగి ఉన్న కంపెనీ. ఒకరకంగా ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఈ సంస్థ కేరాఫ్ గా నిలుస్తోంది. మేఘా మీద ఎన్ని రాజకీయ విమర్శలు వచ్చినా బిజినెస్ చేసుకుంటూ, వచ్చిన ఆదాయంతో సేవ చేస్తూ దేశంలో అన్ లిస్టెడ్ కంపెనీల్లో మొదటి స్థానానికి చేరుకుని ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశ ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళుతోంది మేఘా. ఒక పక్క రాయలసీమకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు క్లిష్టమైన హంద్రీ-నీవా నిర్మించినా, పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో ఐదు నదులను అనుసంధానం చేసిన ఘనత మేఘాదే. అది కాక తెలంగాణలో ఎత్తులో ఉన్న బీడు భూములకు నీరు అందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేసినా అది మేఘా సత్తానే.
1989లో చిన్న సంస్థగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రస్థానం అనంతరకాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో ఒక దిగ్గజం సంస్థగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థను 1989లో సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పీవీ కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో ఎంఈఐఎల్ రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌలిక వసతుల రంగంలోకిమల్లించారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది సంస్థ. మనదేశంలో దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో పనులు చేస్తూ సత్తా చాటింది మేఘా. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ట్రాన్స్ పోర్ట్, హైడ్రో కార్బన్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు ఇలా ఎందులోనూ తగ్గకుండా పనులు చేస్తూ వెళ్ళింది మేఘా సంస్థ.
అలాంటి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఖాతాలో మరో మెగా కాంట్రాక్ట్ చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక ప్రాజెక్టులు మేఘా సంస్థ నిర్వహిస్తోండగా ఇప్పుడు తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు మొత్తం వంద బ్యాటరీ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ దక్కించుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రం మీద వాయు కాలుష్యం తగ్గించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని గతంలో ఏపీఎస్ ఆర్టీసీకీ ప్రభుత్వం సూచించింది. దీంతో తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. మొత్తం 140 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్ర్రీన్ టెక్ సంస్థ దక్కించుకుంది. మేఘా సంస్థలో భాగమైన ఈ ఒలెక్ట్రా సంస్థ ఏడాది కాలం పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత కూడా చేపట్టనుంది.