iDreamPost
iDreamPost
గత ఏడాది నాని జెర్సీ ప్రేక్షకులకు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందో చూసాం. కమర్షియల్ గా అద్భుతాలు చేయనప్పటికీ డీసెంట్ రన్ తో ఫైనల్ గా హిట్ ముద్రను సొంతం చేసుకుంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మన నిర్మాతలే హిందీలోనూ షాహిద్ కపూర్ తో రీమేక్ చేసేంత. కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాక షాహిద్ మనసు పడి మరీ చేసిన మూవీ ఇది. షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయ్యింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్ లోనూ టేకప్ చేశాడు. దీంతో సందీప్ వంగా తరహాలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు.
ఇదిలా ఉండగా గౌతమ్ తర్వాత చేయబోయే సినిమా రామ్ చరణ్ తోనే అన్నది ఫ్రెష్ అప్ డేట్. ఈ వార్త చాలా కాలం క్రితమే చక్కర్లు కొట్టినప్పటికీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేని కారణంగా పెండింగ్ లో పెట్టారని ప్రచారం జరిగింది. ఆర్ఆర్ఆర్, ఆచార్యల తో బిజీగా ఉన్న చెర్రీ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదంటే ఇప్పటిదాకా చెప్పలేదు. ఫైనల్ గా గౌతమ్ స్క్రిప్ట్ నే లాక్ చేసినట్టు వినికిడి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనికి ఎన్వి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారట. లూసిఫర్ రీమేక్ లోనూ ఈయన భాగస్వామిగా ఉన్నారు. ఇదేదో వరస జాక్ పాట్ లా కనిపిస్తోంది.
ఇదంతా ఓ కొలిక్కి రావడానికి 2021 వేసవి పడుతుంది. రామ్ చరణ్ ఆలోగా తన రెండు సినిమాలు పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడు. అయితే గౌతమ్ రూపొందించబోయే మూవీ మాత్రం ఎంటర్ టైన్మెంట్ అండ్ ఎమోషన్ తో సాగుతుందట. వినయ విధేయ రామ తర్వాత చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండూ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి సబ్జెక్టు అయితేనే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. గౌతమ్ హిందీ జెర్సీ పనులు పూర్తి కాగానే చరణ్ స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దే పనిలో ఉంటాడు. మూడో సినిమాకు మెగా ప్రాజెక్ట్ దక్కడం అంటే మాటలా. ఇది హిట్ అయితే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవడమే ఆలస్యం.