iDreamPost
iDreamPost
ఈ ఏడాది థియేటర్లు నడిచిన మూడు నెలల్లో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక మందన్న త్వరలో అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీని కోసమే ప్రత్యేకంగా చిత్తూరు స్లాంగ్ కూడా నేర్చుకుంటోంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ రెండు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అవ్వడంతో తన డిమాండ్ మాములుగా లేదు. ఇదే వరసలో తనకో మెగా ఆఫర్ కూడా ఓకే అయినట్టుగా ఫిలిం నగర్ టాక్. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ అరగంటకు పైగా కనిపించే స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. తనకూ ఓ హీరోయిన్ ఉంటుంది.
ఇప్పటిదాకా ఇద్దరు ముగ్గురు ఆప్షన్లు అనుకున్నారు కానీ అవేవి కుదరలేదు. కియారా అద్వానీ ఆసక్తి చూపించినా ఎందుకో మరి అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడా ఛాన్స్ రష్మిక మందన్నను వరించినట్టుగా వినికిడి. ఆచార్యలో తనకు ఒక డ్యూయెట్ కూడా ఉంటుందట. కీలకమైన ఎపిసోడ్ కాబట్టి ప్రాధాన్యమైన సీన్లే ఉన్నాయట. ఎలాగూ బన్నీతో మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టేసింది కాబట్టి ఇప్పుడు చరణ్ తో చేయడం కూడా పెద్ద ప్లస్ అవుతుంది. అందులోనూ చిరంజీవితోనూ కొన్ని కాంబినేషన్ సీన్లు ఉంటాయట. ఎలాగూ ఆయన సరసన హీరోయిన్ గా చేసే వయసు కాదు కాబట్టి కనీసం ఇలా కలిసి నటించే అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకు వదిలేయాలన్న ఆలోచన కావొచ్చు.
ఆచార్య షూటింగ్ అక్టోబర్ నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వేసవి విడుదల అని చెప్పేశారు కాబట్టి ఇంకా టైం చాలా ఉంది. దర్శకుడు కొరటాల శివ త్వరగా దీన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తాలూకు పనుల్లో బిజీ కావాల్సి ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్యలో మెయిన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటిదాకా రెండు పాటలతో కలిపి 40 శాతం షూట్ పూర్తి చేసుకున్న ఆచార్యలో ఇంకా కీలకమైన భాగాలు చిత్రీకరించాల్సి ఉంది. కరోనా పూర్తిగా సద్దుమణిగితేనె చిరు లాంటి సీనియర్ హీరోలతో షూటింగ్ వేగంగా పూర్తి చేయొచ్చు. ఇది అయ్యాకే మెహెర్ రమేష్-బాబీ-లూసిఫర్ రీమేక్ వీటిలో ఏది ముందు మొదలుపెడతారన్న క్లారిటీ వస్తుంది.