iDreamPost
iDreamPost
వచ్చే నెల డిసెంబర్ 9న నాగబాబు కూతురు నీహారిక పెళ్లి రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ప్యాలెస్ లో జరగనున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా గోప్యంగా ఉంచారు. ఇటీవలే వరుడు చైతన్య తండ్రి స్వయంగా ఈ వివరాలు వెల్లడించడంతో సస్పెన్స్ తొలగిపోయింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆయా తేదీల్లో ఎలాంటి షూటింగ్ కమిట్ మెంట్స్ పెట్టుకోకుండా ముందుగానే ఖాళీని ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ వసతికి సంబంధించిన టికెట్ల బుకింగ్, బోర్డింగ్ లాడ్జింగ్ వ్యవహారాలన్నీ రెండు కుటుంబాల ఈవెంట్ మేనేజర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చాలా రోజుల తర్వాత మెగా ఇంట జరగబోతున్న అమ్మాయి పెళ్లి కావడంతో ఆ ఫ్యామిలీ అందరిలోనూ ఒకరకమైన ఉద్విగ్నత ఉంది. ఇదిలా ఉండగా నీహారికకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ స్పెషల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది. అదేంటనేది బయటికి రాలేదు కానీ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్టు సమాచారం. వరుణ్ తేజ్ దగ్గరుండి చెల్లి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు కాబట్టి తనకు ఈ ప్లాన్ లో భాగం లేదు. ఈవెంట్ రోజున మెగా హీరోలందరూ స్టేజి మీద ఆడిపాడే కార్యక్రమం కూడా ఉంది. సంగీత్ కూడా భారీగా చేయబోతున్నారట.
కానీ ఈ ఈవెంట్ కి లైవ్ ఇవ్వకపోవచ్చు. హైదరాబాద్ లో వివాహం చేస్తే మీడియాతో పాటు అభిమానుల తాకిడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్రైవేట్ ఈవెంట్ గా సెట్ చేశారు. చాలా కొద్ది అతిధులు మాత్రమే ఇందులో పాల్గొంటారు. రానా మ్యారేజ్ తరహాలో ఇంట్లో నుంచే చూసేలా వర్చువల్ సెట్స్ ని ఇండస్ట్రీ ప్రముఖులకు పంపబోతున్నారు. తిరిగి వచ్చాక ఇక్కడ రిసెప్షన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు కాబట్టి చేస్తారో లేదో కూడా ఇంకా ఖరారు కాలేదు. సినిమాల్లో ఫెయిలైనప్పటికీ వెబ్ మీడియాలో నీహారికకు తెచ్చుకుంది. అందుకే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ వేడుక మీద ఆసక్తి ఉంది.