iDreamPost
android-app
ios-app

నిజాల‌కు సంకెళ్లు వేసే స్వేచ్ఛ‌ మీడియాకు ఉందా?

  • Published Nov 01, 2019 | 7:08 AM Updated Updated Nov 01, 2019 | 7:08 AM
నిజాల‌కు సంకెళ్లు వేసే స్వేచ్ఛ‌ మీడియాకు ఉందా?

పెంపుడు జంతువులు అనే న‌వ‌ల‌లో కేఎన్‌వై ప‌తంజ‌లి గారు మీడియా వైఖ‌రిపై త‌న నిర‌స‌న‌ను ఓ పాత్ర ద్వారా” ఇలా  వ్య‌క్త‌ప‌రిచారు – “లోకంలో నోట్లు, దొంగ‌నోట్లు ఉన్న‌ట్టే, ప‌త్రిక‌లు, దొంగ ముండా ప‌త్రిక‌లూ ఉన్నాయి. అటువంటి దొంగ‌ముండా ప‌త్రిక న‌డుపుతున్నందుకు మీ ముగ్గ‌ర్ని (ఎడిట‌ర్‌, ప‌బ్లిష‌ర్‌, ప్రింట‌ర్‌) క‌లిపి అలాగ స‌ముచితంగా సంబోధించాను.  ఈ రోజు మీ ప‌త్రిక చ‌దివి, ఉండ‌బ‌ట్ట‌లేక ఈ ఉత్త‌రం రాయ‌డం నా సామాజిక బాధ్య‌త‌గా భావించి రాస్తున్నాను” .  .

ఈ రోజు (న‌వంబ‌ర్ ఒక‌టి, 2019) ఓ దిన‌ప‌త్రిక మెయిన్ మొద‌టి పేజీ చ‌దివిన త‌ర్వాత తూటాల్లాంటి ప‌తంజ‌లి గారి రాత‌ల స్ఫూర్తితో లేఖ లాంటి వ్యాసం రాయాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌ధానంగా రెండు వార్త‌ల గురించి చ‌ర్చిద్దాం.

1.పోల‌వ‌రం జ‌ల‌విద్యుత్కేంద్రంపై మేఘాతో జెన్కో ఒప్పందం

బుల్లెట్ పాయింట్స్‌లో మాత్రం ప‌గ‌లు స్టేలు ఎత్తివేత‌…రాత్రిక‌ల్లా ప‌త్రాల‌పై సంత‌కాలు పూర్తి,న‌వ‌యుగ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌త లేద‌న్న హైకోర్టు

2.క‌లాల‌కు క‌ళ్లెమా? ప‌్ర‌ధాన శీర్షిక‌తో కూడిన వార్త‌. స‌బ్ హెడ్డింగ్ః కేసుల జీవోపై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌

మొద‌టి వార్త విష‌యానికి వ‌ద్దాం.

పోల‌వ‌రం జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టు ప‌నుల‌ను థ‌ర్డ్ పార్టీకి అప్ప‌గించేందుకు అడ్డుగా ఉన్న ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు కొట్టివేసింది. థ‌ర్డ్ పార్టీకి ప‌నులు అప్ప‌గించ‌కుండా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌న్న అభ్య‌ర్థ‌న‌తో న‌వ‌యుగ కంపెనీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా ఈ పిటిష‌న్‌పై గ‌తంలో స్టే ఇస్తూ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది తాజా వార్త‌.

ఇదే ప్రాజెక్టుపై ఆగ‌స్టు 22న హైకోర్టు స్టే విధించిన సంద‌ర్భంలో న‌వ‌యుగ కంపెనీకి అనుకూలంగా తీర్పు వ‌చ్చిన నేప‌థ్యంలో ఒక్క‌సారి ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మెయిన్ పేప‌ర్‌ను చూద్దాం.

రివ‌ర్స్ చెల్ల‌దు అని బ్యాన‌ర్ హెడ్డింగ్ తో హాప్ పేజీ వార్త‌ను ప‌రిచారు. స‌బ్ హెడ్డింగ్ కింద పోల‌వ‌రంపై స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ అని పేర్కొంటూ బుల్లెట్ పాయింట్స్ కింద కాంట్రాక్ట్ ర‌ద్దు కుద‌ర‌ద‌న్న హైకోర్టు, రీటెండ‌ర్ నోటిఫికేష‌న్ స‌స్పెన్ష‌న్‌, స‌ర్కార్‌, జెన్కో తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు, ఇది జెన్కో కుదుర్చుకున్న ఒప్పందం, ర‌ద్దు చేసే అధికారం ప్ర‌భుత్వానికి లేదు త‌దిత‌ర అంశాలు చేర్చుతూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్లో హైకోర్టు హిత‌వు అని జ‌జ్జ‌న‌క‌…జ‌జ్జ‌న‌క అంటూ నాట్యామాడారు.

అలాగే  పోల‌వ‌రం జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రివ‌ర్స్ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురు దెబ్బ త‌గిలింద‌ని, ఈ కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేసే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసిందంటూ వార్త మొద‌లు పెట్టి జ‌గ‌న్ స‌ర్కార్‌పై అక్ష‌రాల‌తో క‌దం తొక్కారు.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ న‌వ‌యుగ కంపెనీ చేప‌డుతున్న జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేస్తూ ఏపీ జెన్కో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్  చేస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులిచ్చిందంటూ వార్తా క‌థ‌నాన్ని న‌డిపారు. అంత‌టితో ఆగితే ఆంధ్ర‌జ్యోతిఎందుకవుతుంది ?హైకోర్టు స్టేపై విప‌క్ష‌నేత చంద్ర‌బాబు అన్న‌ట్టు “మూర్కంగా ముందుకు” శీర్షిక‌తో అచ్చు వేసి లోప‌లి పేజీలో రెండు కాలాల వార్త‌ను నింపారు.

మూర్కంగా ముందుకు శీర్షిక‌తో వేసిన ఈ వార్త‌లో పోల‌వ‌రంపై ప్ర‌యోగాలు వ‌ద్ద‌ని ఎవ‌రెన్ని చెప్పినా విన‌కుండా ప్ర‌భుత్వం ముందుకెళ్లింద‌ని విప‌క్ష‌నేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు.  ఈ తీర్పుపై ప్ర‌భుత్వం ఏం చెబుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వానికి పిచ్చి అనుకోవాలో, రాష్ర్టానికి ప‌ట్టిన శ‌ని అనుకోవాలో అని తీవ్ర‌స్థాయిలో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇదే వార్త‌లో నీటిపారుద‌ల‌శాఖ మాజీ మంత్రి దేవినేని, సోమిరెడ్డి, టీడీపీ అధికార ప్ర‌తినిధి అనురాధ త‌దిత‌రుల అభిప్రాయాల‌ను వండి వ‌డ్డించారు. నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనీల్‌కుమార్ రాజీనామా చేయాల‌ని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు ఇప్పుడేం చేద్దాం శీర్షిక పేరుతో ఓ క‌థ‌నం ప్రచురించారు. అందులో పోల‌వ‌రం నిర్మాణాల‌కు సంబంధించి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు హైకోర్టు బ్రేక్ వేసిన నేప‌థ్యంలో త‌దుప‌రి ఏం చేయాల‌నే నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ‌ర్గాలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయ‌ని చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశారు.

శ‌భాష్‌…శ‌భాష్ ఆంధ్ర‌జ్యోతి. పాఠ‌కుల‌కు స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇవ్వ‌డ‌మే మీడియా బాధ్య‌త కాబ‌ట్టి…మీరు మీ బాధ్య‌త‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించార‌ని కాసేపు అభినందిద్దాం. మ‌రి ఇదే ప్రాజెక్టుపై నిన్న ఇదే హైకోర్టు స్టే ఎత్తివేస్తూ ఇచ్చిన తీర్పును మీరు ఎలా ప్ర‌చురించారో ఒక్క‌సారి చూసి త‌రిద్దామా?

పోల‌వ‌రం జ‌ల‌విద్యుత్ కేంద్రంపై మేఘాతో జెన్కో ఒప్పందం శీర్షిక‌తో ఓ వార్త‌. దీనికి బుల్లెట్ పాయింట్స్ః ప‌గ‌లు స్టే ఎత్తివేత‌…రాత్రిక‌ల్లా కాగితాల‌పై సంతకాలు; న‌వ‌యుగ పిటిష‌న్‌కు విచార‌ణార్హ‌త లేద‌న్న హైకోర్టు.

దీనికి సంబంధించి లోప‌లి పేజీల్లో మాత్రం పోల‌వ‌రం జ‌ల‌విద్యుత్కేంద్రంపై స్టే ఎత్తివేత అంటూ అఇష్టంగా ఓ వార్త‌ను ప్ర‌చురించారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా న్యాయ‌స్థానంలో తీర్పు వెలువ‌డిన‌ప్పుడు ప‌రుగెత్తిన మీ క‌లాల‌కు ఇప్పుడేం రోగం వ‌చ్చింది?  వార్త‌ను వార్త‌గా, నిజాల‌ను నిర్భ‌యంగా జ‌నాల‌కు అందించేందుకు మీకు ఎందుకు మ‌న‌సు రావ‌డం లేదు?


ఇప్పుడు రెండో వార్త గురించి మాట్లాడుకొందాం.

క‌లాల‌కు క‌ళ్లెమా? ప‌్ర‌ధాన శీర్షిక కింద కేసుల జీవోపై స‌ర్వ‌త్రా నిర‌స‌న అంటూ ఓ చ‌క్క‌టి వార్త‌ను ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించింది. ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా నిరాధార‌, త‌ప్పుడు వార్త‌లు రాస్తే ఇక‌పై కేసులు పెడుతామంటూ జ‌గ‌న్ స‌ర్కార్ 2430 పేరుతో పాత జీవోకు స‌వ‌ర‌ణ చేస్తూ కొత్త జీవో జారీ చేసింది. ఈ జీవోను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ ప‌లు ప్ర‌తిప‌క్ష‌, ప్ర‌జాసంఘాలు, జ‌ర్న‌లిస్టు సంఘాల నిర‌స‌న తెలియ‌జేస్తూ ఆందోళ‌న‌కు దిగిన స‌మాచారాన్ని వార్త‌గా ఇచ్చారు.

ఇదే సంద‌ర్భంలో ఆంధ్ర‌జ్యోతిలో అద్భుత‌మైన సంపాద‌కీయం కూడా రాశారు. ఆ సంపాద‌కీయంలో కొన్ని ముఖ్య‌మైన అంశాలు , తెలుసుకొందాం.

ప్రభుత్వ ప్రయత్నం ప్రతీ విలేకరిని  భయంలోనూ, మీడియా సంస్థలను ప్రభుభక్తిలోనూ ఉంచాలనుకోవడం వినా మరేమీ కాదు. ప్రజలపక్షాన నిలచి, ప్రభుత్వ అనాలోచిత, దురుద్దేశపూరిత చర్యలను ప్రశ్నించే మీడియా సంస్థలపైనే దీని గురి అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.  ప్రజావాణిని వినిపించడం పత్రికల ప్రథమ కర్తవ్యం.  ప్రజలలో ప్రజాస్వామిక స్పృహ పెరుగుతున్న ఈ కాలంలో పాలనలో పారదర్శకతను పెంచాల్సిన పాలకులు, ఒకపక్క రహస్యజీవోలు జారీ చేస్తూ, మరోపక్క ఇలా మీడియా గొంతునొక్కేందుకు ప్రయత్నించడం విచిత్రం. ప్రజాస్వామిక వ్యవస్థలకు నష్టం చేకూర్చడమంటే అంతిమంగా తమకు తాము హాని తెచ్చిపెట్టుకోవడమే. ఇటువంటి నియంతృత్వ పోకడలు పనికిరావని, ప్రజలు హర్షించరని ప్రభుత్వ ఆత్మీయ సలహాదారులు హితవు చెబితే బాగుండును.

ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కీయ‌లంలో పేర్కొన్న‌ట్టు పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు తీర్పును న‌వ‌యుగ‌కు అనుకూలంగా వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా, వ్య‌తిరేకంగా వ‌చ్చిన‌ప్పుడు మ‌రోలా అచ్చు వేయ‌డం వెనుక ఎవ‌రి ప్ర‌భు భ‌క్తిలో మునిగి తేలాడుతున్నారో జ‌నానికి చెప్పితీరాలి. ఎందుకంటే వీరే చెబుతున్న‌ట్టుగా ప్ర‌జ‌ల్లో ప్ర‌జాస్వామిక స్పృహ నానాటికి పెరుగుతోంది. ఏ వార్త ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం తెలుసుకోలేని అజ్ఞానంలో లేరు. ఒక‌వైపు క‌లానికి క‌ళ్లెం అంటూ భారీ శీర్షిక‌ల‌తో క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తున్న మీకు, నిజాల‌కు క‌ళ్లెం వేసే స్వేచ్ఛ ఉంద‌నుకుంటున్నారా?

ఈ సంద‌ర్భంగా పెంపుడుజంతువులు న‌వ‌ల‌లో పేర్కొన్న ఓ అంశాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను.

“వారం రోజుల పాటు మీరు మీ దొంగ‌ప‌త్రిక‌ను ఆపేసి దొంగ‌నోట్లు ముద్రించుకోండి. (డ‌బ్బు సంపాద‌న కోసం మీరిప్పుడు చేస్తున్న ప‌నీ, అదీ ఒక్క‌టే లెండి) దొంగ‌నోట్ల ముద్ర‌ణ ఆర్థిక నేరం మాత్రమే. మీరిప్పుడు చేస్తున్న సామాజిక, ఆర్థిక నేరాల కంటే అది త‌క్కువ ర‌కం నేరంలెండి. మీరు వారం రోజుల పాటు మీ ప‌త్రిక‌ని ఆపితే మీ దొంగ‌ప‌త్రిక‌ల మీద ఆధార‌ప‌డి బ‌తుకుతున్న , జ‌నం గొంతులు కోస్తున్న దొంగ రాజ‌కీయ నాయ‌కులు, దొంగ ప్ర‌భువులూ అల్ల‌ల్లాడిపోతారు. వారం రోజుల పాటు సామాజిక‌, సాంస్కృతిక కాలుష్యం త‌గ్గితే జ‌నం ఆయుష్షు ఆ మేర‌కైనా పెరుగుతుంది”

న‌ల‌భై ఏళ్ల క్రితం రాసిన ఈ న‌వ‌ల నేటి మీడియా దుర‌వ‌స్థ‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపుతున్నాయి.   మీడియా ఫోర్త్ ఎస్టేట్ కాదు రియ‌ల్ ఎస్టేట్ అని ఏ మ‌హానుభావుడో అన్నాడో గాని నేటి ప‌చ్చ‌మీడియాను చూస్తే నిజ‌మ‌నిపించ‌డం లేదూ?  

Sodum Ramana