iDreamPost
iDreamPost
జాతిపిత మహాత్మాగాంధీకి సహచరుడిగా ఉంటూ దాదాపు తన జీవితం మొత్తం భారత జాతీయోద్యమానికి అంకితం చేసిన వ్యక్తి, భారత స్వతంత్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించిన ప్రముఖ నాయకుడు. బహుభాషావేత్త, దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం నేడు. ఆయన జన్మదినం నాడు ఆ మాహానాయకుడిని స్మరిస్తూ జాతీయ విద్యాదినంగా జరుపుకుంటున్నాం..
1888 నవంబరు 11న ముస్లిం మతస్తులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలో ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు అబుల్ కలాం జన్మించారు. వీరి తండ్రి మౌలానా మహ్మద్ ఖైరుద్దీన్ డిల్లీలో పేరుమోసిన సూఫీ పండితుడే కాకుండా 1857 భారత ప్రథమ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న దేశభక్తుడు. ఆజాద్ అసలుపేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు..’ఆజాద్’ అనేది ఆయన కలంపేరు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు.
1898లో కలకత్తాలో స్థిరనివాసం ఏర్పర్చుకున్న మౌలానా ఆజాద్ కొంతకాలం ఉపాధ్యాయుడిగా ఉండి ఆ తరువాత తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1912లో అల్ హిలాల్ అనే పత్రికను ప్రారంభించి స్వాతంత్ర పోరాటంలో ముస్లిం మతస్తులు , హిందువులు కలిసి పోరాడాలని ప్రభోదించిన దేశ భక్తుడిగా భారత ప్రజలకు ఆజాద్ మొదట పరిచయం అయ్యారు.
మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలకలేదని ప్రభుత్వం 1914లో అల్ హిలాల్ పత్రికను నిషేధించి ఆజాద్ పై ఆరేళ్ళు కఠిన శిక్షని విధించింది. 1920లో శిక్షను పూర్తిచేసుకుని విడుదలైన ఆజాద్ గాంధీజీ నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని తిరిగి అరెస్టు అయ్యారు. 1920 నుండి 1945 మధ్యలో ఆజాద్ 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. 1923లో మొట్టమొదటిసారిగా 34వ ఏట మౌలానా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షపదవిని చేపట్టారు. కాంగ్రెస్ కష్ట కాలంలో ఆజాద్ నౌపుణ్యం ఓర్పుతో కాంగ్రెస్ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించారు. 1947 స్వతంత్రం అనంతరం తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, 1952నుంచి మరణించేవరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టి ఉపనాయకుడిగా సేవలు అందించారు.
తెల్లదొరల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు. ఇక స్వాతంత్రం అనంతరం 1948లో ప్రాథమిక ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమీషన్‌లు ఏర్పాటు చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. అలాగే సంగీత, సాహిత్య, లలితకళల అభివృద్దికి అకాడమీలను ఏర్పాటు చేశారు. ఆజాద్ తన 69వ ఏట 22 ఫిబ్రవరి 1958న తుదిశ్వాస విడిచారు . భారత విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.