iDreamPost
iDreamPost
ఊహించని ఓటిటి అప్డేట్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్న విజయ్ మాస్టర్ ఇంకో రెండు రోజుల్లో అంటే జనవరి 29నే స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వచ్చిన వార్త అభిమానులతో పాటు ట్రేడ్ ని సైతం షాక్ కు గురి చేసింది. ఇప్పుడీ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. నిజానికి దీని ప్రీమియర్స్ ఫిబ్రవరి 12 నుంచి ఉంటాయని గతంలో వచ్చిన టాక్. అప్పటికి థియేట్రికల్ రన్ జరిగి నెల అయ్యుంటుంది కాబట్టి కలెక్షన్ల మీద పడే ప్రభావం ఏమి ఉండదు. అక్కడికే ఉప్పెన లాంటి కొత్త సినిమాలు రిలీజై ఉంటాయి.
ఇప్పుడిది అధికారికంగా ధృవీకరించారు కాబట్టి వంద కోట్లకు పైగా మార్కెట్ ఉన్న పెద్ద స్టార్ హీరో , అతి తక్కువ వ్యవధిలో కేవలం 16 రోజుల థియేట్రికల్ గ్యాప్ తో ఓటిటి స్ట్రీమింగ్ జరిగిన సినిమాగా మాస్టర్ నిలిచిపోతుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనపెడితే తమిళనాడులో ఇప్పటికీ హౌస్ ఫుల్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ ఇప్పటికే 200 కోట్లు దాటిందట. తమిళ వర్షన్ ఇంకో యాభై దాకా రాబట్టొచ్చని అరవ డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పుడీ పరిణామం పట్ల వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచి రన్ లో ఉన్న సినిమాను చేతులారా చంపేస్తారా అని నిలదీస్తున్నారు.
జనవరి 29 డేట్ తో కూడిన కొత్త ట్రైలర్ ని ప్రైమ్ తన యాప్ లో ఉంచింది. అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇందాకే అఫీషియల్ నోట్ తో పాటు ప్రమోషన్లు మొదలయ్యాయి. వివిధ పిఆర్ఓలు ప్రీమియర్లను ఖరారు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. వాటి ప్రకారం మాస్టర్ 28 రాత్రి 10 గంటల 15 నిమిషాల నుంచే అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. హీరో విజయ్ తన సంతోషాన్ని పంచేసుకున్నారు. ఇదే తరహాలో మన రవితేజ క్రాక్ ని కూడా ఆహా యాప్ ముందు 29 ప్లాన్ చేసుకుని ఆ తర్వాత వసూళ్ల దృష్ట్యా తేదీని ఫిబ్రవరి 5కి మార్చుకున్న సంగతి తెలిసిందే. మాస్టర్ విషయంలో అలా జరిగే ఛాన్స్ లేదు. సో ఎల్లుండి రాత్రి నుంచే మాస్టర్ చిన్నితెరలపై సందడి చేయబోతున్నాడు.