iDreamPost
iDreamPost
కరోనా దారుణాతి దారుణంగా సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టింది ఇంకా తీస్తోంది కూడా. జనజీవనం సాధారణమవుతోంది థియేటర్లకు అనుమతులు కూడా వచ్చేశాయని సంబరపడుతున్న వేళ సెకండ్ వేవ్ వార్తలు పరిశ్రమ వర్గాలను నిద్రపోనివ్వడం లేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో హాళ్లు తెరవలేదు. వచ్చే నెల ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటిటిల హవా ఇకపై తగ్గిపోతుందని, మునుపటి లాగే జనం హౌస్ ఫుల్ కలెక్షన్లతో మల్టీ ప్లెక్సులను, థియేటర్లను నింపేస్తారని కలలు కంటున్న ఎగ్జిబిటర్లకు రోజూ కునుకు పట్టడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ కు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ హీరోగా ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి విలన్ గా రూపొందిన మాస్టర్ ఇప్పటిదాకా థియేట్రికల్ విడుదల కోసమే వేచి చూసింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పట్లో యాభయ్ శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిబంధనను సడలించే ఆలోచనలో లేదట. అంతే కాదు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను ఆరు నెలల పాటు నిషేధించే ప్రతిపాదన ఉన్నట్టు చెన్నై టాక్. ఇవే జరిగితే విజయ్ రేంజ్ స్టార్ కు ఓపెనింగ్స్ పరంగా తీవ్ర ప్రభావం ఉంటుంది. అభిమానులు ఎంత అండగా నిలబడినా మహా అయితే రెండు మూడు రోజులు లేదా వారం అది హెల్ప్ అవుతుంది. తర్వాత చూడాల్సింది సాధారణ ప్రేక్షకులే.
ఈ పరిమితులన్నీ దృష్టిలో పెట్టుకుని మాస్టర్ నిర్మాతలు తాజాగా ఓటిటి డీల్స్ గురించి చర్చల్లో ఉన్నారట. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏ సినిమాకు దక్కని భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చిందని చెన్నై న్యూస్. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ ప్రచారమయితే జోరుగా ఉంది. విజయ్ డ్యూయల్ రోల్ చేశారని ముందే లీక్ వచ్చింది కనక అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి చాలా దిగజారిపోయింది. చాలా దేశాల్లో లాక్ డౌన్ మళ్ళీ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ లాంటి హై ఎండ్ బడ్జెట్ మూవీ కూడా డిజిటల్ మార్గం పట్టక తప్పేలా లేదు. చూద్దాం.