iDreamPost
iDreamPost
ఎవరు మీలో కోటీశ్వరులుతో పాటు జెమిని ఛానల్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ఆశించిన స్పందన దక్కించుకోలేకపోయింది. యుట్యూబ్ లో ప్రతి వంటకం గురించి, దేశ విదేశాల రెసిపీల గురించి లక్షల్లో వీడియోలు ఉండగా ప్రత్యేకంగా ఈ షోని ఎవరు చూస్తారన్న అనుమానాలు నిజం చేస్తూ అంతగా టిఆర్పిని సాధించలేకపోయింది. తమిళంలో విజయ్ సేతుపతితో తెలుగులో తమన్నాతో ఒకేసారి స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళింది. తన స్థానంలో యాంకర్ అనసూయను తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ తమన్నా సదరు నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపించడం టీవీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిర్మాతల వెర్షన్ వేరేలా ఉంది. రెండు కోట్ల రెమ్యునరేషన్ కు పద్దెనిమిది ఎపిసోడ్లు చేస్తానని ఒప్పుకున్న తమన్నా చివరి రెండు భాగాలకు రాలేదని దాని వల్ల మూడు వందల టెక్నీషియన్లు పని చేసే తమ ప్రోగ్రాంకు అయిదు కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారట. ఇంతే కాదు సెకండ్ సీజన్ అడ్వాన్స్ కూడా తమన్నా ఇప్పుడే అడుగుతున్నారని వాళ్ళు చెబుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం అలాంటిదేమి లేదని ఆవిడతో రెండో సిరీస్ కొనసాగించే ఆలోచనే లేదని చెప్పడం మరో ట్విస్టు. ఒప్పుకున్న ప్రకారం మొత్తం పూర్తి చేయకుండా రివర్స్ లో తమనే నిందించడం భావ్యం కాదని వాళ్ళ వాదన.
ఇద్దరిలో ఎవరిది నిజమో కాలమో చట్టమో నిర్ణయిస్తుంది కానీ మొత్తానికి దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే మాస్టర్ చెఫ్ పెద్దగా సక్సెస్ కాలేదనే. ఒకప్పుడు ఇంటర్ నేషనల్ లెవెల్ లో పలు దేశాల్లో బ్లాక్ బస్టర్ అయిన మాస్టర్ చెఫ్ ఏళ్ళ క్రితం హిందీలోనూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యాతగా బాగా నడిచింది. కానీ తెలుగులో మాత్రం ఇలా జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినా ట్రెండ్ కు తగ్గట్టు ఆడియన్స్ లో వచ్చిన మార్పులను గమనించకుండా పాత ఫార్ములాలో వెళ్తే అది సినిమా అయినా టీవీ షో అయినా ఫలితం ఒకేలా వస్తుందని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలా. మరి తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ – ప్రభాస్ తో సహా అన్ని ఆప్షన్లు వాడేస్తున్న రొమాంటిక్