Idream media
Idream media
వందల ఎకరాల ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములను ఇతరుల పేరుపై అక్రమంగా మార్చిన ఉదంతం మార్కాపురంలో వెలుగులోకి రావడం, ఈ కుంభకోణంలో తహసీల్దార్ సహా కార్యాలయ సిబ్బంది అందరూ భాగస్వాములవడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విచారణ తర్వాత ఒక్క నెలలోనే 702.01 ఎకరాల భూములను ఇతరుల పేరుతో అక్రమంగా మ్యూటేషన్ చేశారని తేల్చిన అధికారులు.. అందులో ప్రభుత్వ భూమి 378.89 ఎకరాలు ఉందని నిర్థారించారు. ఆ భూమినంతా తిరిగి యథాతథ స్థితికి తీసుకువచ్చేంలా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు, చేర్పులు చేసే పనిని అధికారులు ప్రారంభించారు.
మార్కాపురంలో జరిగిన భూ దందా వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఈ తరహాలో ఇంకా ఎక్కడైనా జరిగి ఉందేమోనన్న అనుమానంతోపాటు అసలు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ..? ఎంత ఉన్నాయి..? అనే విషయం తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు.. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయా…? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి..? ప్రస్తుతం వాటి స్థితి ఏమిటి..? ఆక్రమణలకు గురయ్యాయా..? వంటి వివరాలను పంపాలని వీఆర్‌వోలు, సర్వేయర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో కదలిన వీఆర్‌వోలు, సర్వేయర్లు.. రెవెన్యూ విలేజ్ పరిధిలో సర్వేను ప్రారంభించారు.
Also Read : వందల ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలు.. సూత్రదారి అతనే..!
పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ భూములు..
ప్రకాశం జిల్లా భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది. తూర్పు ప్రకాశంలో సారవంతమైన భూములు, సాగునీటి వసతి ఉంటుంది. పశ్చిమ ప్రకాశంలో అందుకు భిన్నమైన పరిస్థితి. పశ్చిమ ప్రకాశంగా పిలిచే కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు పూర్తిగా వర్షాధారమైన ప్రాంతాలు. కొండలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ భూములను రైతులకు కేటాయిస్తూ డి పట్టాలు జారీ చేశారు. మరికొన్ని భూములను డి పట్టాలులేకపోయినా స్థానికులు సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని బీడుగా ఉన్నాయి. సాగు చేసుకుంటున్నా.. డి పట్టాలు లేని భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ సర్వేయర్లు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయా భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. తాము సాగుచేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా..? అన్న భయం వారిలో నెలకొంది.
ఆగిపోయిన మ్యూటేషన్లు..
మార్కాపురంలో జరిగిన దందా వెలుగులోకి రావడం, రిటైర్డ్ తహసీల్దార్‌పై క్రిమినల్ చర్యలు, ఆర్‌ఐ, వీఆర్‌వో, సర్వేయర్‌లు సహా 17 మందిపై వేటు, అవుట్‌సోర్సింగ్ విధానంలోపని చేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్‌ను విధుల నుంచి తప్పించడంతో.. జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా.. వంశపారంపర్యంగా సాగు చేసుకుంటూ 1ఏ, 1బి రికార్డుల్లో దాయాదుల పేర్లు ఉన్నా ఆయా భూములను వారసుల పేరుతో మ్యూటేషన్ చేసేందుకు ఫార్మాలిటీస్‌తో ఫైల్స్ సిద్ధం చేసిన వీఆర్‌వోలు.. ఇప్పుడు ఆ పనికి పూర్తిగా పుల్‌స్టాఫ్ పెట్టారు. రిజిస్ట్రేషన్ జరిగిన భూములను మాత్రమే మ్యూటేషన్ చేస్తామని చెబుతున్నారు. మార్కాపురం ఎఫెక్ట్ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.
Also Read:ఆరెస్సెస్ చీఫ్ తో మాజీ చీఫ్ జస్టిస్ భేటీ – టార్గెట్ మహారాష్ట్ర?