Idream media
Idream media
మరియమ్మ చనిపోయింది. మరియమ్మ అంటే ఎవరు? సెలబ్రిటి కాదు, ప్రముఖుడి తల్లి కాదు, ఉద్యోగి కాదు, చేతి కింద వంద ఓట్లు ఉండే లీడర్ కాదు, అగ్రవర్ణాల మహిళ కాదు. వీటిలో ఏ ఒక్కటైనా ఆమె బతికేది.
మరియమ్మ ఒక పేదరాలు, బతుకు కోసం, మెతుకు కోసం వంట చేసుకుని బతికే వృద్ధురాలు, దళితురాలు. అందుకే చచ్చిపోయింది. లాకప్‌లో దెబ్బలు తిని పోలీసుల చేతిలో చచ్చిపోయింది. మరణానికి ఇంతకు మించిన కారణాలు కావాలా?
రాజ్యాంగం అందరికీ జీవించే హక్కుని ఇచ్చింది. ఉదాహరణకి ఒక సెలబ్రిటి జీవించే హక్కుకి భంగం కలిగితే దేశంలోని అన్ని వ్యవస్థలు రంగంలోకి దిగి కాపాడతాయి. కాపాడాలి కూడా. అదే మరియమ్మకి జరిగితే ఎవరూ కాపాడరు. చనిపోవడమే ఆమె హక్కు. సెలబ్రిటికి డబ్బుంటుంది. మరియమ్మ పేదరాలు. సింపుల్‌గా చెప్పాలంటే జీవించే హక్కుకి డబ్బు గ్యారెంటీ ఇస్తుంది. పేదవాడివైతే ఫిప్టీ ఫిప్టీ. నిన్ను ఏదో ఒక నేరంలో ఇరికించి లాకప్‌లో చంపేయొచ్చు. ఆ పనిని బ్రిటీష్ కాలం నుంచి పోలీసులు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.
ఒక సెలబ్రిటికి , ఒక గవర్నర్ భార్యకి, లేదా ఒక రాజకీయ నాయకుడి భార్యకి ఏ రకంగా జీవించే హక్కు ఉందో అదే హక్కు మరియమ్మకి కూడా ఉంది. ఇంకో 10, 20 ఏళ్లు జీవించి మనుమళ్లు, మనుమరాళ్ల ముచ్చట్లు చూడాల్సిన ఒక తల్లిని లాఠీలతో కొట్టి చంపేశారు.
పేదరికం, వృద్ధాప్యం, పౌష్టికాహార లోపం ఇన్ని ఉన్న శరీరం లాఠీ దెబ్బల్ని తట్టుకుంటుందా? బతిమలాడి ప్రాథేయపడి వుంటుంది. అవమానంతో దొంగతనం చేయలేదని ఏడ్చి వుంటుంది. ఆ SIకి పోలీసులకి కూడా ఒక తల్లి వుంటుంది. తన బిడ్డలు యోగ్యులైనారని ఆనందించే వుంటుంది. తనని చూడను వస్తే “మంచిగుండు బిడ్డా” అని చెప్పే వుంటుంది. యూనిఫారం తన బిడ్డల్ని పులి చర్మంలా చుట్టుకుందని ఆమెకి తెలియదు.
వాళ్లకేం శిక్ష పడుతుంది. ఏమీ పడదు. కొంత కాలం సస్పెన్షన్. తర్వాత మరియమ్మ బిడ్డల్ని రాజీకి పిలుస్తారు, బెదిరిస్తారు. తల్లిని పోగొట్టుకున్న వాళ్లు పేద దళితులు. వాళ్లు పోలీస్ వ్యవస్థపై యుద్ధం చేసి శిక్ష పడేలా చేయగలరా? అసాధ్యం. మరియమ్మకి చాలా కాలంగా గుండె జబ్బు ఉందని తేలుస్తారు. ఇదంతా జరిగే సరికి మరియమ్మ ఎవరికీ గుర్తుండదు. ఇంకో మరియమ్మ కోసం మీడియా వెతుకుతూ వుంటుంది.
విచిత్రం ఏమంటే ఈ కేసులోని SI, పోలీసులు అందరూ బాగా చదువుకున్నవాళ్లే. ఇపుడు కనీసం డిగ్రీ లేకుండా కానిస్టేబుల్ కూడా లేడు. పీజీలు చదువుకున్న వాళ్లు ఉన్నారు. మరి చదువు వీళ్లకి ఏం నేర్పింది? మనిషిని మనిషిగా చూడటం తెలియకపోతే పీజీలు, పీహెచ్‌డీలు ఏం సాధించినట్టు?
పోలీసులు మానవత్వంతో వ్యవహరిస్తే నేరస్తులు కంట్రోల్ అవుతారా? అనేది ప్రశ్న. నా చిన్నప్పుడు పోలీసులు నిక్కర్లు వేసుకుని సైకిళ్లపై తిరిగే వారు. ఇపుడు ప్యాంట్లు, బైక్‌లు వచ్చాయి. అధికారులకి ఇన్నోవా వాహనాలు వచ్చాయి. నేర పరిశోధన ఎంతో ఎదిగింది. కానీ మన పోలీసులు మాత్రం అనుమానితులనే చావబాదడమే మొదటి పనిగా పెట్టుకున్నారు.
పోనీ అందరికీ ఒకటే న్యాయమా? అంటే , బలమైన వాళ్ల జోలికి పోరు. నేరం ఒప్పుకునే వరకూ బలహీనుల్ని కొడతారు. మరియమ్మకు కుల బలం, ధన బలం వుంటే కొడతారా? వంద ఆలోచిస్తారు. దళితుల్ని కొట్టొచ్చు, చంపొచ్చు. రెండు రోజులు వాళ్లువీళ్లు అరిచి ఊరుకుంటారు. 25 ఏళ్లు జర్నలిజంలో ఇవే చూశాను.
ఢాంబికులు నీ సన్నిధి నిలవలేరు
కపటము చూపి నరహత్య జరిగించువారు
యోహోవాకి అసహ్యులు
-కీర్తనల గ్రంధం అధ్యాయం 5
ప్రతిరోజూ దేవుడి ముందర నిలబడి ప్రార్థనలు చేసే వాడికే దేవుడు వాక్యం అర్థం కాలేదు. చర్చి పాస్టర్‌కి రోజూ మరియమ్మ అన్నం వడ్డించింది. దానికి బదులుగా ఆయన మరణాన్ని ప్రసాదించాడు.
దొంగతనం జరిగితే కనిపెట్టడానికి సైంటిఫిక్‌గా ఎన్నో పద్ధతులున్నాయి. కానీ పోలీసులకు తెలిసిన పద్ధతి ఒకటే. ఇప్పుడు సమస్య అదికాదు. జీవించే హక్కు కోసం పోరాడడం, ముఖ్యంగా దళితుల జీవించే హక్కు.
ఇంటర్‌నెట్, వైఫై, కెరీరిజం , డబ్బు నానా రణగొణ శబ్దాల మధ్య మానవ హక్కుల కోసం ఎవరైనా అరిచినా వినబడ్డం లేదు. మనం ఇతరుల కోసం మాట్లాడకపోతే , మన కోసం మాట్లాడే వాళ్లు కూడా ఉండరు.
Also Read : ఏబీఎన్ ఆ లింకు తొలగించడం వెనుక కారణాలేంటి, హైకోర్టు వ్యవహారాల్లో ఏం జరుగుతోంది?