iDreamPost
android-app
ios-app

Maoist RK – మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే ఇక లేరు..?

Maoist RK – మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే ఇక లేరు..?

మావోయిస్టు పార్టీకి భారీ నష్టం చేకూరింది. ఆ పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్‌కే తుది శ్వాసవిడిచారని తెలుస్తోంది. చాలా కాలంగా పోలీసుల హిట్ లిస్టులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూసినట్టు, అంతుచిక్కని వ్యాధి సోకి అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు బస్తర్ పోలీసు అధికారులు పేర్కొన్నట్టు తెలుగు మీడియా ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే చంద్రబాబు మీద అలిపిరి బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా మాజీ సీఎం చంద్రబాబు హత్యకు కూడా ప్లాన్ చేసిన వారిలో ఆర్కే కీలక సూత్రధారి అని చెబుతుంటారు.

ఇక వైఎస్ హయాంలో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపిన ఆయన దేశవ్యాప్తంగా ఏకంగా 85 కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఆర్కేకు బలిమెల ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగిలింది,అయినా తృటిలో తప్పించుకున్నారు. కానీ బలిమెల ఎన్‌కౌంటర్‌లోనే తన కుమారుడిని కోల్పోయారు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతూ సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలోనే ఉంటున్నారు.సాధారణ దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన ఆర్కే అగ్రనేతగా ఎదిగారు. ఇక ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారని ఆయన కరోనాతో మృతి చెందారని కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఇక ఆర్కే అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. మావోయిస్ట్ దళాలలన్నిటిలో వ్యూహంలో రచించడంలో ఆర్కే దిట్ట. మావో దళంలో 20 ఏళ్లుగా యాక్టివ్‌గా పని చేస్తున్న రామకృష్ణపై ఏకంగా కోటి రూపాయల రివార్డు కూడా పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది. ఎన్నో సార్లు ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన తనకు కొట్టిన పిండి అయినా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా అడవుల్లోకి జారుకునే వారు. ఇక ఆర్కే స్థానంలో బలమైన నేతను నియమించాకే ఆయన మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Also Read : Darsi Ex MLA – దర్శి మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి కన్నుమూత