iDreamPost
android-app
ios-app

ద్విముఖ ప్రణాళికతో పరిషత్‌ పోరు

ద్విముఖ ప్రణాళికతో పరిషత్‌ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలే జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. అందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పార్టీ గుర్తుపై జరిగే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను రెండు దఫాలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.

రాష్టంలో 660 మండలాలు ఉండగా మొదటి దఫాలో 333 మండలాలకు రెండో విడతలో మిగిలిన 327 మండలాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రణాళకలు సిద్ధం చేస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాలు మొదటి విడతలో, మిగతా సగం మండలాలు రెండో విడతలో ఎన్నికలకు జరగనున్నాయి. మొదట విడతలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీల స్థానాలకు, రెండో విడతలో 327 జడ్పీటీసీలు, 4,877 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ నెల 17వ తేదీన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడనుంది. రెండు విడతల్లో నిర్వహించే ఈ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తికానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెల్లడైన మూడు రోజులకు ఎంపీపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నిక పూర్తి చేయనున్నారు.