iDreamPost
iDreamPost
రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కలకలం రేపింది. తీవ్ర దుమారం దిశగా సాగుతోంది. నానిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడికి టీడీపీ తో సన్నిహిత సంబంధాలున్నట్టు బయటపడడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని జల్లా ఎస్సీ నిర్ధారించారు దాంతో రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే పేర్ని నాని సన్నిహితుడి హత్య జరిగింది. మచిలీపట్నంలో కీలక నేతగా ఎదుగుతున్న సమయంలో మోక భాస్కర్ రావుని హత్య చేశారు. ఈ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన సమయంలో రవీంద్ర తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి చివరకు తుని సమీపంలో పట్టుబడ్డారు. రిమాండ్ కి వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు.
జూన్ 3న మోకా భాస్కర్ రావు హత్య జరిగి దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. అదే సమయంలో పేర్ని నాని మీద ఆయన తల్లి దశదిన కర్మ సందర్భంగా హత్యాయత్నం చేయడం అందరినీ అనుమానాలకు గురి చేస్తోంది. హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే అక్కడ ఉన్న వారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాగేశ్వరరావు సోదరి ఉమాదేవి టీడీపీ మండల నాయకురాలిగా పనిచేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. దాంతో ఈ హత్యాయత్నం వెనుక ఇంకా ఎవరెవరున్నారన్నది అనుమానాలకు తావిస్తోంది.
దాంతో కేసు సమగ్ర దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు. అన్ని కోణాల్లో విచారించాలని ఆశిస్తున్నారు. రాజకీయ కోణం ఏమయినా ఉందేమో తేల్చాలని మచిలీపట్నం ప్రజలు కూడా ఆశిస్తున్నారు. బందరులో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరుసగా హత్యలు, హత్యాయత్నాలు వెలుగులోకి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేతల మధ్య కక్ష సాధింపుతో హత్యలకు పాల్పడుతున్న తీరుని తీవ్రంగా నిరసిస్తున్నారు. తాజా ఘటనలో నిజానిజాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. అదే జరిగితే మరింత సంచలనంగా మారవచ్చని సందేహిస్తున్నారు.