iDreamPost
android-app
ios-app

28 ఏళ్లు జైలులో మగ్గిపోయిన ‘న్యాయం’

  • Published Apr 24, 2022 | 8:52 PM Updated Updated Apr 24, 2022 | 9:21 PM
28 ఏళ్లు జైలులో మగ్గిపోయిన ‘న్యాయం’

వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది సహజ న్యాయసూత్రం. కానీ అక్కడ ఆ న్యాయసూత్రం అమలు కాలేదు. ఒక హత్య కేసులో అనుమానితుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28 ఏళ్లు అన్యాయంగా జైలులో మగ్గిపోయాడు. విచారణ మధ్యలో నిలిచిపోవడం, కనీసం బెయిల్ కూడా లభించక పోవడంతో అతని విలువైన యవ్వనమంతా జైలు ఊచల మధ్యే కరిగిపోయింది. ఇంత జరిగినా అతనే దోషిగా తేలిందా అంటే అదీ లేదు.
నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించే ఆధారాలు లేవంటూ కోర్టు అతని విడుదలకు ఆదేశించడంతో యువకుడిగా జైలుకు వెళ్లిన ఆ వ్యక్తి వృద్ధుడిగా బయటకు వచ్చాడు.

స్నేహితుడిని హత్య చేశాడని ఆరోపణ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం థియోరియా జిల్లా తంద్వా గ్రామానికి చెందిన బీర్బల్ భగత్ అనే యువకుడు బీహార్లోని గోపాల్ గంజ్ జిల్లా హరిహర్ పూర్ లో ఉంటున్న తన స్నేహితుడు సూర్యనారాయణ భగత్ ను చూడటానికి అతని గ్రామానికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఉపాధి కోసం 1993 జూన్ 11న ముజఫర్ పూర్ వెళ్లారు. కొద్ది రోజులకే సూర్యనారాయణ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతని కోసం వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో అతని కుమారుడు సత్యనారాయణ 1993 జూన్ 28న గోపాల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లినప్పుడు అతనితో ఉన్న బీర్బల్ పై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ లో బీర్బల్ ను అనుమానితుడిగా చేర్చారు. కొన్నాళ్ల తర్వాత పోలీసులకు ఒక మృతదేహం లభించింది. అది అదృశ్యమైన సూర్యనారాయణదేనని కుటుంబ సభ్యులు గుర్తించడంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి అనుమానితుడిగా ఉన్న బీర్బల్ ను 1994 జనవరి 27న అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపారు. అప్పటికి 28 ఏళ్ల యువకుడైన బీర్బల్ అప్పటి నుంచీ జైల్లోనే మగ్గిపోయాడు.

విచారణ లేదు.. బెయిలు లేదు

ఈ కేసు విచారణ మొదట ఫాస్ట్ ట్రక్ కోర్టులో మొదలైంది. 1995 ఫిబ్రవరి 28న పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే తర్వాత కాలంలో ఫాస్ట్ ట్రక్ కోర్టులను మూసివేయడంతో కేసు విచారణ నిలిచిపోయింది. మరోవైపు నిందితుడిగా ఉన్న బీర్బల్ కు బెయిల్ ఇచ్చే విషయాన్ని అటు పోలీసులు.. బెయిల్ తెప్పించే ప్రయత్నాన్ని అతని కుటుంబ సభ్యులు చేయకపోవడంతో బీర్బల్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎంత తీవ్రమైన కేసులోనైనా నిర్ణీత కాలపరిమితికి మించి నిందితులను రిమాండ్ లో ఉంచరాదని, కచ్చితంగా బెయిల్ ఇచ్చి బయటకు పంపాలని చట్టం చెబుతోంది. కానీ ఇక్కడ ఆ న్యాయం కూడా బీర్బల్ కు దక్కలేదు.

ఆధారాలు లేవు.. సాక్షులు లేరు

ఏళ్ల తరబడి జాప్యం తర్వాత ఇటీవలే ఈ హత్య కేసు గోపాల్ గంజ్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు-5 కు బదిలీ అయ్యింది. అదనపు సెషన్స్ జడ్జి విశ్వభూత్ గుప్తా కేసు స్థితిగతులను పరిశీలించి సీరియస్ గా స్పందించారు. విచారణ వేగవంతం చేశారు. అయితే నిందితుడిపై మోపిన హత్య అభియోగాన్ని నిరూపించే ఒక్క ఆధారం కూడా పోలీసులు సమర్పించలేకపోయారు. సాక్షులు కూడా ఎవరూ లేరు. ఇతర వివరాలు కూడా లభించలేదు. చివరికి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా విచారణకు హాజరుకాలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆధారాలు లేనందున నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయాలని ఆదేశించారు.

కోర్టు తీర్పు విన్న వెంటనే నిందితుడు బీర్బల్ బోరున రోదిస్తూ కోర్టులోనే కూలబడిపోయాడు. విలువైన తన 28 ఏళ్ల జీవిత కాలం జైలులోనే కరిగిపోయిందని, చేయని నేరానికి శిక్ష అనుభవించానని వాపోయాడు. ఇప్పుడు విడుదలై ఏం ప్రయోజనమని రోదించాడు. అతని కుటుంబ సభ్యులు కోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేసినా.. బీర్బల్ అన్యాయంగా జైలుపాలు కావడంతో తమ కుటుంబం నష్టపోయిందని, ప్రభుత్వం తమకు చేయుతనివ్వాలని కోరుతున్నారు.