iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో మలయాళంలో హిట్ అయిన సినిమాలను మనవాళ్ళు దేన్నీ వదలకుండా ఎలా పోటీ పడి రీమేక్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. సత్యదేవ్ నుంచి చిరంజీవి దాకా అందరూ ఈ రూట్ పట్టిన వాళ్లే. అయితే అంతో ఇంతో కాస్త గట్టి విషయమే ఉన్న ఒక మల్లు వుడ్ మూవీ మాత్రం నేరుగా డబ్బింగ్ రూపంలో ఓటిటలో రాబోతుండటం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. మమ్ముట్టి హీరోగా రూపొందిన వన్ ఈ నెల 30న ఆహా యాప్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. గత అయిదారు నెలలుగా డబ్బింగులుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఆహా ఇంత పెద్ద సినిమాను ఈ రూపంలో తీసుకురావడం విశేషమే. అంతగా ఇందులో ఏముందో అనే డౌట్ వస్తోంది కదూ.
ఇదో పొలిటికల్ థ్రిల్లర్. కాకపోతే పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ కాలేజీ కుర్రాడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వల్ల ప్రభావితం చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాలనలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడతాడు. స్వంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైనా తట్టుకుని మరీ నిలబడతాడు. రాజీనామా చేసే పరిస్థితి వస్తే జనమే అండగా నిలబడి మళ్ళీ ఆయన్నే ఎన్నుకోవడం ఇందులో మెయిన్ థీమ్. ఆద్యంతం ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో సాగే వన్ లో మమ్ముట్టి ఎంట్రీ అరగంట తర్వాత ఉంటుంది. దానికి ముందంతా ఒక యువకుడి చుట్టూనే తిప్పినా బోర్ కొట్టకుండా నడిపించారు దర్శకుడు.
నిజానికిది రీమేక్ మెటీరియల్. ఎవరైనా పెద్ద హీరో చేస్తే కొన్ని కీలకమైన మార్పులతో బాగా వర్కౌట్ చేయొచ్చు. కానీ టాలీవుడ్ నిర్మాతలు ఇందులో రిస్క్ ఉందనుకున్నారో లేక ఇప్పటి ప్రభుత్వాల మనోభావాలను దెబ్బ తీసినట్టు అవుతుందనో ఏమో మొత్తానికి ఆసక్తి చూపించలేదు. బాష ఏదైనా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఓటిటి లవర్స్ అన్ని సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడీ వన్ కూడా నెలల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. సబ్ టైటిల్స్ తో చూసినవాళ్లు చాలానే ఉన్నారు. ఇక ఇలాంటి శ్రమ అవసరం లేకుండా నేరుగా తెలుగులోనే చూసేయొచ్చు. ఈ వారం ఇదే తరహాలో ఆహా నీడను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే
Also Read: పొగరుబోతు భార్యకు సినిమా క్లాస్ – Nostalgia