పొగరుబోతు భార్యకు సినిమా క్లాస్ - Nostalgia

By iDream Post Jul. 24, 2021, 08:30 pm IST
పొగరుబోతు భార్యకు సినిమా క్లాస్ - Nostalgia

పొగరుబోతు భార్య పాత్రలున్న సినిమాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి ఘరానా మొగుడు లాంటివే కానీ దీనికన్నా చాలా ముందే మంచి ఫ్యామిలీ డ్రామాతో కూడిన చిత్రాలు కొన్ని వచ్చాయి. అలాంటిదే నా మొగుడు నాకే సొంతం. 1989లో తమిళంలో విజయ్ కాంత్ - సుహాసిని - రేఖ కాంబినేషన్లో 'ఎన్ పురుషన్ తాన్ ఎనక్కు మట్టుమ్ తాన్' అనే సినిమా వచ్చింది. కలైమణి కథనందించగా మనోబాల డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇళయరాజా పాటలు మారుమ్రోగాయి. దీన్ని తెలుగులో తీయాలనే ఆలోచనతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీమేక్ హక్కులను కొన్నారు. అప్పటికింకా సోలో హీరోగా ఆయన మార్కెట్ బలపడలేదు.

గురువు దర్శకరత్న దాసరి నారాయణరావుతో సినిమా కోసం కథను వెతుకుతున్న క్రమంలో ఇది ఇద్దరికీ బాగా నచ్చేసింది. విలన్ గా చాలా పాత్రలు చేసిన మోహన్ బాబుకు దీని రూపంలో హీరోగా మంచి బ్రేక్ దక్కుతుందనే నమ్మకం కలిగింది. అంతే. షూటింగ్ కి శ్రీకారం చుట్టేశారు. వాణి విశ్వనాథ్, జయసుధ హీరోయిన్లుగా కోట శ్రీనివాసరావు, గొల్లపూడి, చరణ్ రాజ్, సుధాకర్, గిరిబాబు, రమాప్రభ తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. సంగీత దర్శకులుగా మామ కెవి మహదేవన్ ఈ బృందంలో చేరారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించారు. వాణి విశ్వనాథ్ కు అప్పటికిది రెండో సినిమానే. మొదటి చిత్రం సింహస్వప్నం ఇది సైన్ చేసే టైంలో రిలీజ్ కాలేదు.

అహంకారంతో నిజాలు గుర్తించకుండా భర్తను అనుమానంతో వేధిస్తూ చివరికి కాపురంలో కుంపటి పెట్టుకునే పాత్రలో వాణి విశ్వనాథ్ బెస్ట్ ఛాయస్ అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ కోసం తీసుకున్న జయసుధ తన అనుభవంతో క్యారెక్టర్ ని నిలబెట్టేశారు. 'దొంగమొగుడు'లో చిరంజీవికి సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ పోలికలు కొన్ని మోహన్ బాబు పాత్రలో కనిపిస్తాయి. 1989 జూలై 14న రిలీజైన 'నా మొగుడు నాకే సొంతం'కు మంచి మహిళాదరణ దక్కింది. ఒక్క రోజు ముందు విడుదలైన 'అంకుశం' ప్రభంజనాన్ని తట్టుకుని మరీ ఈ సినిమా అయిదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. కలెక్షన్ కింగ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

Also Read: బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు

Also Read: డార్లింగ్ జోరు అస్సలు తగ్గడం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp