iDreamPost
android-app
ios-app

Mamata , modi – మమతా ఎత్తులు, మోడీ ఆల్ హ్యాపీస్

  • Published Dec 02, 2021 | 4:24 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Mamata , modi – మమతా ఎత్తులు, మోడీ ఆల్ హ్యాపీస్

జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. మోడీ వర్సెస్ అదర్స్ అనేది అంత సులువు కాదని తేలిపోతోంది. మోడీ తో ఉమ్మడిగా ఢీకొట్టాలని ఆశిస్తున్న విపక్షాల ఐక్యతకు అవకాశం లేదని తేలిపోతోంది. మోడీకి వ్యతిరేకంగా సమిష్టి పోరుకి బదులుగా విడివిడిగా పోరాడేందుకు పలువురు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో మమతా బెనర్జీ ముందున్నారు. ఆమెను ఆప్ అధినేత కూడా అనుసరిస్తున్నారు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా మమతా బెనర్జీ యత్నాలన్నీ కలిసి మోడీకి మరోసారి ఊరటనిచ్చేందుకు తోడ్పడతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

దేశంలో ఎవరికి నచ్చినా, నచ్చకున్నా నేటికీ మోడీకి జనాదరణ ఉంది. ప్రధాని పదవికి పోటీదారుల్లో ఆయన తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత సహజంగానే కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ గాంధీ రెండోస్థానంలో ఉంటారు. ఉత్తరాదిని ఆరేడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలే ప్రధాన పోటీదారులుగా ఉంటారు. కానీ తూర్పు నుంచి తనకు అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత కాంగ్రెస్ తో కలిసి సాగుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చిన ఆమె ఇటీవల కాంగ్రెస్ ని కాదని ముందుకెళుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ని బలహీనపరిచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. త్రిపుర, మేఘాలయా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని చీల్చి టీఎంసీని బలపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గోవాలో కూడా అందుకనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. టీఎంసీకి భిన్నంగా మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ లకు తాము సమదూరం పాటిస్తున్నామని చెబుతోంది. కాంగ్రెస్ తో కలిసి కార్యాచరణకు అత్యధికమార్లు దూరంగా ఉంది. అదే సమయంలో పంజాబ్ లో కాంగ్రెస్ కి ప్రధాన పోటీదారుగా ఉంది. గుజరాత్ లో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లేలా వ్యవహరిస్తోంది. గోవా, ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు ఆప్ యత్నాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు టీఎంసీ, ఇటు ఆప్ అధినేతల వ్యవహార శైలి ఆసక్తి రేపుతోంది. ఇరువురూ ఇప్పుడు పీఎం రేసులో కనిపిస్తున్నారు. అవకాశం దక్కితే మోడీ స్థానంలో తామే పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారనడంలో సందేహం లేదు. కేవలం ఢిల్లీ వంటి చిన్న రాష్ట్ర సీఎం గా ఉన్న కేజ్రీవాల్ కన్నా ఈ విషయంలో మమతా బెనర్జీ ముందుంటారని చెప్పవచ్చు. ఆమెకు 42 సీట్లున్న రాష్ట్రంలో అధికారం ఉంది. అక్కడ మళ్లీ ఆమెకు ఆధిక్యం దక్కుతుందనే గ్యారెంటీ కూడా ఉంది. పైగా జాతీయ రాజకీయాల్లో ఆమెకు విస్తృత పరిచయాలు, అనుభవం కూడా ఉంది.

Also Read : Central Government – రామాయపట్నానికి రాం రాం అంటున్న కేంద్రం

ప్రశాంత్ కిషోర్ పాత్రేమిటి

తాజా పరిణామాల వెనుక ప్రశాంత్ కిషోర్ దే కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. నిజానికి ఆయన కాంగ్రెస్ లో చేరి చక్రం తిప్పాలని చూశారు. దానికి తగ్గట్టుగా రాహుల్, ప్రియాంక వంటి వారితో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ లో తనకు పూర్తి అధికారాలు కావాలనే కండీషన్ తో కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. నేరుగా సీడబ్య్ల్యూసీలో తనకు చోటు కల్పించాలని కోరినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే వాటిని సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యంగా సీనియర్లను కాదని పీకే లాంటి వారికి పెద్ద పీట వేయడానికి ససేమీరా అంటూ నిర్ణయం తీసుకుంది.

దానిని జీర్ణించుకోలేని పీకే ఇప్పుడు మోడీ కన్నా ముందు కాంగ్రెస్ ని దెబ్బతీసే లక్ష్యంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా శరద్ పవార్, మమతా బెనర్జీలు ముంబైలో కలవడం వెనుక పీకే పాత్ర ఉందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితమే పీకే తో శరద్ పవార్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా మోడీ వ్యతిరేక కూటమి దిశగా అప్పట్లో చర్చలు సాగాయి.

అయితే ఆ తర్వాత పరిణామాలతో తాజాగా మమతా బెనర్జీ ముందుకొచ్చారు. అనూహ్యంగా బెంగాల్ లో జరుగుతున్న ఓ సదస్సుకి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే పేరుతో నేరుగా ఆమె రంగంలో దిగారు. ఆపేరుతో ముంబై వెళ్లి రాజకీయ వ్యవహారాల కోసమే ప్రయత్నిస్తున్నారు. శివసేనకి చెందిన సంజయ్ రౌత్ ఆదిత్యా ఠాక్రేతో కూడా ఆమె భేటీ అయ్యారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మాత్రం ముందుకు రాకపోవడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఏమయినా పీకే చొరవతో జరుగుతున్న ఈ పరిణామాలు మోడీ కి వ్యతిరేకంగా మరో కూటమి దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

శరద్ పవార్ ఏం చేస్తారు

మమతా బెనర్జీ కన్నా ముందు నుంచి ప్రధాన సీటుని శరద్ పవార్ ఆశిస్తున్నారు. ఆయన పార్టీ ఎన్సీపీ పేరుకి జాతీయ హోదా ఉన్నప్పటికీ కేవలం మహారాష్ట్రకే పరిమితమయ్యింది. అయినప్పటికీ ముంబై కేంద్రంగా ఉండే పారిశ్రామిక వేత్తలతో పరిచయాలు, ఇతర రాజకీయ నేతలతో సంబంధాల విషయంలో పవార్ ముందుంటారు. అందులోనూ అనేక విధాలుగా రాజకీయంగా రాటుదేలిన నేత కావడంతో పవార్ కూడా ప్రధాని పదవికి పోటీదారు అనడంలో సందేహం లేదు. మమతాతో పోలిస్తే ఆయనకే ఎక్కువ మంది మద్ధతుగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. దాంతో మమతా బెనర్జీ యత్నాలకు శరద్ పవర్ సై అంటారా అనేది సందేహమే.

తాజాగా పవార్ తో భేటీ తర్వాత యూపీఏ కూటమి గురించి మమతా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. ఇప్పటికీ యూపీఏ భాగస్వామిగా ఎన్సీపీ ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల కూటమిగా పార్లమెంట్ వెలుపలా, బయటా పనిచేస్తోంది. దాంతో ఆయన వ్యవహారం కీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా నిలిచేది ఎవరన్నది కూడా ఆసక్తికరమే. ఓవైపు మూడోసారి మోడీ ముందుకొస్తున్న తరుణంలో రాహుల్ ఒకవైపు మమతా, పవార్, కేజ్రీవాల్ లో ఎవరో ఒకరు మరోవైపు ఉంటే అదే మోడీకే మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. విపక్షాల అనైక్యతే ఆధారంగా బలోపేతం అవుతూ వస్తున్న బీజేపీకి ఇదో పెద్ద వరంగా మారుతుందని మాత్రం చెప్పవచ్చు.

Also Read : BJP,Modi – మోడీ వ్యాఖ్య‌ల్లో అర్థం ఏంటి..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది?