Idream media
Idream media
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ)కి బీజేపీకి మధ్య వైరం తెలిసిన విషయమే. పశ్చిమ బెంగాల్‌లో మమతకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు వెనక్కి పోయి.. బీజేపీ, టీఎంసీలు నువ్వా నేనా అన్నట్లు గత సార్వత్రిక ఎన్నికల నుంచి వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 18 లోక్‌సభ సీట్లు గెలవడంతో మమత అలñ ర్ట్ అయ్యారు. అప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ, ఫలితాల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, రాజకీయ పరిణామాలు.. బీజేపీ, టీఎంసీ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని తెలియజేస్తున్నాయి.
ముందు వరసలో మమత..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంలో మమతా ముందుంటున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీ నేతలు బీజేపీని, మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పుబడుతున్నా.. మమతా స్థాయిలో వారు దూకుడు కొనసాగించడం లేదు. అయితే శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్నట్లుగా.. బీజేపీపై పోరాడుతున్న మమతకు.. శివసేన, ఎన్సీపీ, ఆర్‌జేడీ వంటి పార్టీల అధినేతలు మద్ధతు తెలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమత పోరాడిన తీరు, సాధించిన విజయం ఆమెను మరింత శక్తివంతమైన నేతగా నిలిపింది.
బెనకణి దీదీ..
పశ్చిమ బెంగాల్‌లో అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి శృంగభంగమైంది. ఫలితాల రోజు నుంచే మమత లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ తన అధికారాన్ని ఉపయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నందిగ్రామ్‌లో మమత గెలిచారని ప్రకటించిన తర్వాత.. మళ్లీ ఫలితం తారుమారు కావడం నుంచి.. మంత్రుల అరెస్ట్‌లు, సీబీఐ కేసులు, గవర్నర్‌తో వివాదాలు, ప్రధాన కార్యదర్శి వ్యవహారం.. ఇలా వరుసగా బీజేపీ ప్రభుత్వం మమతను బీజేపీ ఇరుకునపెడుతోందనే చర్చ నడుస్తోంది. అయితే వాటన్నింటికి ఏ మాత్రం బెనకణి మమతా బెనర్జీ.. బీజేపీపై పోరు సాగిస్తోంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. చురకలు అంటిస్తోంది.
బిహార్ ఎన్నికల హామీని గుర్తు చేస్తూ..
సందర్భానుసారంగా మమత.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ చుట్టూ రాజకీయం సాగుతోంది. డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తవుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రకటనపై ఫైర్ అయ్యారు మమత. కేంద్ర ప్రభుత్వం ఉత్తుత్తి మాటలు చెబుతోందని, డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కాబోదంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. బీజేపీ ప్రభుత్వం ఉత్తుత్తి మాటలు చెబుతుందనేందుకు ఆమె ఓ సంఘటనను ప్రస్తావించింది. గత ఏడాది జరిగిన బిహార్ ఎన్నికల సమయంలో తాము గెలిస్తే.. బిహారీలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా పేర్కొంది. ఆ హామీని తాజాగా గుర్తు చేసిన మమతా.. బిహార్ ప్రజలకు వ్యాక్సిన్ వేయడం పూర్తయిందా..? అంటూ ప్రశ్నించారు. ఇలాంటిదే.. తాజాగా చెప్పిన డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అని మమత ఎద్దేవా చేశారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read : బీజేపీ నుంచి టీఎంసీ లోకి వలసలు