iDreamPost
android-app
ios-app

అప్పుడు టీఎంసీలోకి.. ఇప్పుడు బీజేపీలోకి.. బెంగాలో్ చ‌రిత్ర రిపీట్ అవుతోందట‌!

అప్పుడు టీఎంసీలోకి.. ఇప్పుడు బీజేపీలోకి.. బెంగాలో్ చ‌రిత్ర రిపీట్ అవుతోందట‌!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్ లో రాజ‌కీయ వల‌స‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. అధికార‌మే ల‌క్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వ‌రుస కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉన్నాయి. బెంగాల్ ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని బీజేపీ వేస్తున్న ఎత్తులు పారుతున్న‌ట్లే క‌నిపిస్తున్నాయి.

ఎన్న‌డూ ఎదురుకాన‌న్ని స‌వాళ్లు ఈ సారి మ‌మ‌తా బెన‌ర్జీకి ఎదుర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ‌బీజేపీతో పాటు.. సొంత పార్టీలోని కొంద‌రి నేత‌ల‌తో కూడా ఆమె పోరాడాల్సి వ‌స్తోంది. ఒక వైపు వచ్చే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన మొత్తం బలాన్ని, అన్ని వనరులనూ బెంగాల్‌లో ప్ర‌యోగిస్తోంది. కేంద్రంలోని ప్ర‌ముఖ నేత‌ల‌కు, మంత్రుల‌కు బెంగాల్‌ బాధ్యతను అప్పగించి ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు అక్క‌డ క‌లియ తిరుగుతూ రాజ‌కీయ వేడి పుట్టిస్తున్నారు. జేపీ న‌డ్డా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఇరు పార్టీల మ‌ధ్య పోరు మ‌రింత పెరిగింది. బీజేపీ త‌న మార్క్ రాజ‌కీయాల‌తో హ‌డావిడి చేస్తూంటే.. దీదీ తాను చేప‌ట్టిన ప్ర‌తీ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల‌ను ఇంటింటికీ చేర‌వేసే ప‌నిలో ఉంటున్నారు.

బీజేపీని అడ్డుకునేందుకు మ‌మ‌త ఓ వైపు పోరాడుతుంటే.. మ‌రోవైపు పార్టీలో ఏర్ప‌డుతున్న ముస‌లం ఆమెకు త‌ల‌నొప్పిగా మారింది. గోరుచుట్టిపై రోకలిపోటులా, నిన్నటివరకూ అత్యంత నమ్మకస్తులుగా భావించిన పార్టీ నేతల నుంచే మమతకు అతిపెద్ద సవాలు ఎదురవుతోంది. వారిలో మొట్టమొదట బీజేపీ తీర్థం పుచ్చుకున్న ముకుల్ రాయ్‌ను రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి వేళ్లూనుకోడానికి ప్రధాన కారణం అని భావిస్తారు. ఆయన తర్వాత గత రెండేళ్లుగా బరక్‌పూర్ బలమైన నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌తోపాటూ కొంతమంది నాయకులు తిరుగుబాటు వైఖరిని అవలంభిస్తూ వచ్చారు.మెదినీపూర్ ప్రాంతానికి చెందిన అగ్ర నేత శుభేందు అధికారి సహా చాలా మంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నారు. వీట‌న్నింటి ద్వారా పార్టీలో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతున్నా అవి స‌ద్దుమ‌ణిగేలా మ‌మ‌త చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుతుంద‌న‌గా మ‌రొక‌రు పార్టీకి జ‌ల‌క్ ఇస్తున్నారు.

తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏడాదిలోనే కేంద్ర మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన‌ట్లు అయింది. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవల రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన దినేశ్‌ త్రివేదిని గతేడాది తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్య‌స‌భ‌కు పంపించింది. అయితే పశ్చిమబెంగాల్‌లో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి తృణమూల్‌ పార్టీ నాయకుల వలసలు పెరగడంతో ఈ క్రమంలోనే ఆయన కూడా రాజ్యసభకు రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా చేసిన సందర్భంగా దినేశ్‌ త్రివేది బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘పశ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయ హింస జ‌రుగుతున్నా నేను నిస్స‌హాయుడిగా మిగిలిపోయా. బెంగాల్‌లో జ‌రుగుతున్న హింసతో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు వాటిల్ల‌నుంది. ఇక్క‌డ కూర్చోవ‌డం నాకు చాలా వింత‌గా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఇక్క‌డ కూర్చున్నా నేనేమీ మాట్లాడ‌లేక‌పోతున్నా. మ‌రి ఏం లాభం. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని త్రివేది ప్రకటించారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీతో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అనంతరం జనతా దళ్‌లో చేరారు. ఆ తర్వాత 1998లో దినేశ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా దినేశ్‌ త్రివేది బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

“పార్టీ వదిలి వెళ్లాలనుకునేవారికి, తలుపులు తెరిచే ఉన్నాయి. అధికార దాహం ఉన్న నేతలు, సామాన్యులను పట్టించుకోకుండా ఎప్పుడూ తమ మంచి గురించే ఆలోచిస్తారు. వారు ఉన్నా, లేకపోయినా ఎలాంటి తేడా ఉండదు” అని మమత ప‌లు వేదిక‌ల్లో చెబుతున్నారు. ఇప్పుడు అలా మాట్లాడుతున్న ఆమె గ‌తంలో ఇత‌ర పార్టీల్లో నుంచి వ‌చ్చే నేత‌ల‌కు త‌లుపులు తెరిచే ఉన్నాయ‌న్న సంకేతాలు ఇచ్చార‌ని విమ‌ర్శిస్తున్నారు. “చరిత్ర పునరావృతం అవతుంది. ఇప్పుడు మమతకు తను చేసిన వాటికి సమాధానం లభిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్‌లో ఎంతోమంది ఎమ్మెల్యేలు, నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించిన మమత, వారు టీఎంసీలో చేరేలా చేశారు. అప్పట్లో పార్టీ మారిన ఎంతోమంది ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు” అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి అన్నారు. టీఎంసీ అధికారంలోకి వ‌చ్చిన తొలి నాళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మనస్ భునియతో పాటు అజయ్ ఘోష్, అసిత్ మజుందార్, కనక్ దేబ్ నాథ్, ఖలీద్ ఇబ్ధుల్లా, గీతా భునియ, ఎస్ఎం జలాల్ వంటి నేతలను త‌మ పార్టీకి చేర్చుకున్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.