పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు రాజ్యాంగ వ్యవస్థల మధ్య యుద్ధంగా మారుతోంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి బెంగాల్లో అధికారం కోసం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మొదలైన రాజకీయ పోరాటం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పోరాటం కాస్త సీఎం, గవర్నర్ మధ్య యుధ్ధంగా మారింది. చివరికి ఈ గవర్నర్ మాకొద్దు.. అతన్ని తప్పించండి.. అని సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతికి లేఖ రాశారంటే వివాదం ఎంతగా ముదిరిందో అర్థం చేసుకోవచ్చు.
లేఖలో ఏముందంటే..
టీకాలు, ఆక్సిజన్, కోవిడ్ సాయం తదితర అంశాలపై మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వరుసగా కేంద్రంపై లేఖాస్త్రాలు సాధిస్తున్న మమతా బెనర్జీ తాజాగా మరో లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ ను టార్గెట్ చేశారు. గవర్నర్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని.. రాజ్యాంగ పరిధులను అతిక్రమిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై దాడి ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వానికి అధినేతగా ఉన్న ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురిచేస్తున్నారని.. పదే పదే శాంతి భద్రతల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ట్వీట్లతో తన పరిధి మీరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి గవర్నర్ తమ రాష్ట్రానికి అక్కర్లేదని.. ఆయన్ను తప్పించాలని కోరుతూ రాష్ట్రపతి రామనాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాశారు. మరోవైపు గవర్నర్ ను తప్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ఆలోచనలో కూడా మమత ఉన్నట్లు సమాచారం.
రాజభవన్ వద్ద గొర్రెలతో నిరసన
ఏడేళ్ల క్రితంనాటి నారద లంచాల కేసును తిరగదోడి ఇద్దరు మంత్రులు సహా నలుగురు టీఎంసీ నేతలను సీబీఐ అరెస్టు చేయడం.. ఈ విషయంలో కేంద్రం, గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదే సందర్బంగా కోవిడ్ నియంత్రణలో కేంద్రం వైఫల్యానికి నిరసనగా రాజభవన్ ఎదుట గొర్రెలతో కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించడం వివాదంగా మారింది. కోల్ కతా నాగరిక మంచ్ అధ్యర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. దీనిపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండే రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శనకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసు అధికారులను నిలదీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.