iDreamPost
android-app
ios-app

మమత, సువేందు ప్రజాక్షేత్రం నుంచి న్యాయక్షేత్రంలోకి

  • Published Jul 16, 2021 | 4:24 AM Updated Updated Jul 16, 2021 | 4:24 AM
మమత, సువేందు ప్రజాక్షేత్రం నుంచి న్యాయక్షేత్రంలోకి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడి.. గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలైంది. వాటితోపాటే జరిగిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితం కూడా తేలిపోయింది. సీఎం మమతపై బీజేపీ నేత సువేందు అధికారి గెలిచినట్లు నాటకీయ పరిణామాల మధ్య ఈసీ అధికారులు ప్రకటించారు. కానీ అక్కడ ప్రారంభమైన రాజకీయ పోరాటాన్ని మమత, సువేందులు ఇంకా కొనసాగిస్తున్నారు. కాకపోతే ఆ పోరాటం ప్రజాక్షేత్రం నుంచి న్యాయస్థానాలకు చేరింది. సువేందు ఎన్నికను సవాల్ చేస్తూ మమత కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. ఆ కోర్టులో విచారణ వద్దంటూ సువేందు సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

కలకత్తా హైకోర్టులో విచారణ వద్దట

నందిగ్రామ్ నియోజకవర్గానికి సంబంధించి మే రెండో తేదీన నిర్వహించిన ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత తనను విజేతగా మొదట ప్రకటించిన అధికారులు.. గంట వ్యవధిలోనే మాట మార్చి తన ప్రత్యర్థి సువేందు అధికారి గెలిచినట్లు ప్రకటించారని మమత తన పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం వర్చువల్ గా జరిపిన విచారణలో ఆమె స్వయంగా పాల్గొన్నారు.

అనంతరం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు. నందిగ్రామ్ ఎన్నికల రికార్డులు, ఈవీఎంలు భద్రంగా ఉంచాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ తరుణంలో సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కలకత్తా హైకోర్టులో విచారణ జరపడం తనకు సమ్మతం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక్కడ తప్ప ఇంకేదైనా హైకోర్టుకు కేసును బదిలీ చేయాలని కోరుతున్నారు. కలకత్తా హైకోర్టులో విచారణ జరిపితే సీఎం హోదా మమత దాన్ని ప్రభావితం చేస్తారని ఆయన ఆరోపించారు. ఇక్కడ తప్ప ఇంకే కోర్టు అయినా తనకు అభ్యంతరం లేదని.. ఆ మేరకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరడం విశేషం. దాంతో నందిగ్రామ్ పోరాటం న్యాయస్థానాలకు వ్యాపించిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈసీతో తృణమూల్ బృందం భేటీ

మరోవైపు నందిగ్రామ్ లో ఓడిపోయినా సీఎం పదవి చేపట్టిన మమతా దీదీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా.. అంటే నవంబర్ నాలుగో తేదీలోగా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంది. ఇప్పటికే రెండున్నర నెలలు గడిచిపోయాయి. మరో మూడున్నర నెలలే మిగిలి ఉన్నాయి. కానీ ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం కాకపోవడం మమతను, టీఎంసీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

గడువులోగా ఎన్నిక కాలేకపోతే మమత సీఎం పదవి వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. గురువారం తృణమూల్ ప్రతినిధి బృందం ఈసీ అధికారులను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టిందని.. థర్డ్ వేవ్ రాకముందే భావానీపూర్ తో సహా ఖాళీగా ఉన్న ఏడు స్థానాలకు వెంటనే ఉప ఎన్నికలు ప్రకటించాలని బృందం విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు బృందం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఉప ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.