iDreamPost
android-app
ios-app

ఆ నినాదం దీదీకు కోపం.. బీజేపీ వ్యూహం!

ఆ నినాదం దీదీకు కోపం.. బీజేపీ వ్యూహం!

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత వేడిని ఈసారి పుట్టిస్తున్నాయి. ఒక దశాబ్దం పాటు అప్రతిహతంగా బెంగాల్ కోటలో తన జెండా ఎగుర వేసిన మమతా దీదీ కు భారతీయ జనతా పార్టీ ఈ సారి గట్టి పోటీని ఇస్తోంది. వామపక్షాల కంచుకోటగా గతంలో ఉండే బెంగాల్లో ఈసారి వాటి జాడే కనిపించని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా బిజెపి, తృణముల్ కాంగ్రెస్ ఎన్నికల గానే ఇవి కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడా వామపక్షాల అలకిడి సైతం వినిపించడం లేదు. అయితే రోజురోజుకీ వేగం పుంజుకుంటున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్రమంగా బిజెపి వ్యూహంలో చిక్కుకున్న అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది.

జై శ్రీరామ్ నినాదంపై అక్కసు!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు జైశ్రీరామ్ నినాదం అనేది కీలకంగా మారింది. అధికార పీఠాన్ని ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉన్న బిజెపి జై శ్రీరామ్ నినాదంతో మమతను కలవరపెడుతోంది. దీనికి తగ్గట్టుగానే మమత సైతం ఆ నినాదం వినగానే ఎక్కడలేని కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇటు వామపక్షాల కార్యకర్తలు సైతం ఇప్పుడు ఈ నినాదాన్ని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఆయుధంగా ఉపయోగించుకోవడం విశేషం. మమత ప్రసంగిస్తున్న బహిరంగ సభలోనూ ఆమె కాన్వాయ్ వెళుతుండగా దారిలో నేను సైతం ఈ నినాదం మార్మోగుతుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకం అవుతోంది. ఎంతో జాగ్రత్తగా బిజెపి వేసిన ఈ ఎత్తు లో మమతాబెనర్జీ ఇప్పుడు బయటకు రాలేక సతమతమవుతున్నారు.

బహిరంగంగా కోపం

ఏ రాజకీయ నాయకుడు తనకు ఇష్టం లేని వ్యక్తులు లేదా సిద్ధాంతాలు నినాదాలను విన్నప్పటికీ చిరునవ్వుతో వాటిని విమర్శిస్తారు. వాటిని ఎదుర్కొనే సమయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా అవసరమైన సమయంలో సరైన కౌంటర్ ఇవ్వడం రాజకీయాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో దీదీ తీరు దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఆమె జైశ్రీరామ్ నినాదం వినగానే వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు లేదా సభల నుంచి అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. జనవరి 23 న సుభాష్ జయంతి కావడం తో కలకత్తాలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. దీంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు ముఖ్యమంత్రి హోదాలో మమతాబెనర్జీ వచ్చి సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా జైశ్రీరామ్ నినాదాలు రావడం తో ఆమె తీవ్ర కోపోద్రిక్తురలై వేదిక దిగి వెళ్లిపోయారు.

ఏకంగా పదం పై నిషేధం…

జనవరి చివర్లో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడుతూ జైశ్రీరామ్ నినాదాన్ని పశ్చిమబెంగాల్లో నిషేధించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సమాయత్తమయ్యారు. ఈ నినాదం చేసే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని సైతం ఆమె భావించారు. దీంతో శాసన సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇటు బిజెపి శాసన సభ్యులే కాకుండా కాంగ్రెస్ వామపక్షాలకు చెందిన సభ్యులు సైతం వీధి నిర్ణయాన్ని ఖండించారు. దీంతో ఆ తీర్మానాన్ని మమతాబెనర్జీ పక్కన పెట్టారు.

క్రమంగా బీజేపీ వ్యూహం లోకి

బిజెపి ఈ నినాదాన్ని పశ్చిమబెంగాల్లో గ్రామస్థాయిలో కి కూడా తీసుకు వెళుతుంది. బిజెపి నిర్వహించే ప్రతి సభలోనూ ఈ నినాదాన్ని సభికులు అందరితో పాటూ వచ్చిన ప్రజానీకంతో సైతం గట్టిగా పలికిస్తూ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడ లో కి మమతా బెనర్జీ చిక్కుకున్నట్లు ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినప్పుడు లేదా ప్రతిఘటించి నప్పుడు వారు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ మరింత రెచ్చగొట్టడం బెంగాల్ లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ ప్రజానీకం సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకులు లేదా కార్యకర్తలు ఏదైనా పాల్పడితే గట్టిగా జైశ్రీరామ్ నినాదాలు పలకడం ద్వారా బిజెపి వ్యూహం బెంగాల్లో చక్కగా అమలు అవుతున్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ సైతం దీనిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిజెపి కు దీటుగా వ్యవహరించాలి అనుకున్న అది సాధ్యపడడం లేదు. మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే… మనల్ని శాసించే వ్యక్తులు ఒక విషయాన్ని వద్దు అంటే కచ్చితంగా ఆ విషయాన్ని ఎలాగైనా చేసి తీరాలి అనే భావన కలుగుతుంది. ఈ సైకలాజికల్ థియరీ ఆధారంగానే బిజెపి ఇప్పుడు తృణముల్ ను ముప్పుతిప్పలు పెడుతోంది.