iDreamPost
iDreamPost
సినిమాల్లో యాక్టింగ్ చేయడం ఒక ఎత్తయితే కొందరికి డబ్బింగ్ ఇంకా పెద్ద చిక్కు. గతంలో రాజశేఖర్, సుమన్ లాంటి స్టార్ హీరోలకు సాయి కుమార్ గొంతు ఎంత ప్లస్ అయ్యిందో కళ్లారా చూసాం చూస్తున్నాం. రజనీకాంత్ కు సైతం ఒకప్పుడు ఈయనే ఇచ్చేవాడు కానీ ఆ తర్వాత మనో గాత్రం సదరు సినిమాల హిట్లలో కీలక పాత్ర పోషించడం అందరికీ తెలిసిందే. అయితే మాతృ భాషలో ఎవరికైనా తప్పో ఒప్పో కొంచెం ప్రాక్టీస్ చేస్తే సులువుగా డబ్బింగ్ పట్టు దొరకడం సహజం. అసలు సంబంధమే లేని అలవాటే లేని లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధపడటం అంటే అది ఖచ్చితంగా సాహసమే. అందులోనూ కేరళ క్యాస్టింగ్ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
అసలు విషయంలోకి వద్దాం. మలయాళీ మెగాస్టార్ గా పిలుచుకునే మమ్ముట్టి ముప్పై ఏళ్ళ క్రితం స్వాతి కిరణం చేసినప్పుడు కనీసం ఇక్కడ అఆలు రాకపోయినా నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. మొన్నటి యాత్ర దాకా ఆయన పంథా మారలేదు. మోహ లాల్ అంతటి పెద్ద హీరో మనమంతాలో నటించినప్పుడు వద్దన్నా పట్టుబట్టి మరీ తన గొంతు తానే ఇచ్చుకోవడం గురించి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ప్రతి ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పారు. మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ సైతం నాన్న బాటలోనే వెళ్తున్నారు. కనులు కనులు దోచాయంటేలో వినిపించింది ఇతని వాయిసే. కమిట్ మెంట్స్ అంటే ఇవి.
ఇందులో హీరోయిన్లు కూడా లేకపోలేదు. సాయి పల్లవి ఫిదా కోసం కొంచెం టిపికల్ గా అనిపించే తెలంగాణ యాస మీద గ్రిప్ తెచ్చుకుని మరీ భానుమతిగా ఆ పాత్రను అద్భుతంగా పండించింది. అనుపమ పరమేశ్వరన్ ఇదే దారిలో కొన్ని సినిమాలు చేశాక ధారాళంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. వీళ్ళందరూ మలయాళీ నటీనటులే కావడం గమనార్హం. తమిళం నుంచి కార్తీ ఒక్కడే రెగ్యులర్ గా స్వంత గొంతు ఇస్తున్నాడు. సూర్య ఓసారి ట్రై చేసి సైలెంట్ అయ్యాడు. ఏది ఏమైనా తెరమీద కనిపించే తమ పాత్రలకు తమ గొంతే వినిపించాలని మల్లువుడ్ హీరో హీరోయిన్లు కంకణం కట్టుకోవడం విశేషం. పుష్పలో విలన్ గా చేస్తున్న ఫహద్ ఫాసిల్ కూడా నేనే చెప్పుకుంటానని దర్శకుడు సుకుమార్ తో చెప్పి ఒప్పించినట్టు ఇన్ సైడ్ టాక్