iDreamPost
iDreamPost
థియేటర్లు మూతబడిన వేళ డిజిటల్ రిలీజులు మళ్ళీ ఊపందుకున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా ఇంకాస్త ముందుగానే పెద్ద హీరోల సినిమాలు ప్రీమియర్లకు రెడీ అవుతున్నాయి. వకీల్ సాబ్ కేవలం 21 రోజులకే ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇటీవలే మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన వన్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో రిలీజైనప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం మీద మనవాళ్లకూ ఓ కన్ను ఉంది. లూసిఫర్ తరహాలో ఎవరైనా హక్కులు కొన్నా ఆశ్చర్యం లేదు. ఇంతకీ ఇందులో ఏముందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం.
సనల్(థామస్)అనే కాలేజీ కుర్రాడు పబ్లిక్ ప్లేసుల్లో ముఖ్యమంత్రి లాంటి విఐపిలకు దక్కుతున్న అతి గౌరవం వల్ల సామాన్యులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నిలదీస్తూ ఆగంతకుడి పేరుతో ఫేస్ బుక్ పోస్ట్ చేస్తాడు. ఇది కాస్తా వైరల్ అయ్యి ప్రతిపక్షం ఏకంగా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చే దాకా వెళ్తుంది. వ్యవహారం ముదురుతున్న తరుణంలో సిఎం కడక్కల్ చంద్రన్(మమ్ముట్టి)ఆ అబ్బాయిని పిలిచి మీడియా ముందు క్షమాపణ చెబుతాడు. దేశ రాజకీయాల్లో సమూల మార్పు తెచ్చి అవినీతి లేకుండా చేయాలని చంద్రన్ కంకణం కట్టుకుంటాడు. దీంతో స్వపక్షంలోనే వ్యతిరేకత వస్తుంది. అక్కడ నుంచి మొదలయ్యే డ్రామానే వన్
దర్శకుడు సంతోష్ విశ్వనాధ్ చాలా లోతుగా ఆలోచించి దీన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా మొదలైన అరగంట దాకా మమ్ముట్టి ఎంట్రీ లేకపోయినా విసుగు రాకుండా చిన్న పాయింట్ మీద అంత ఆసక్తికరంగా నడపడం బాగుంది. అయితే హీరో ఎలివేషన్లోతో పాటు రాజకీయాలకు సంబంధించి చాలా లోతైన చర్చలు డీటెయిల్డ్ గా పెట్టడంతో రెండున్నర గంటల నిడివి కొంత బోర్ కొట్టిస్తుంది. గోపి సుందర్ నేపధ్య సంగీతం బాగుంది. అక్కడి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు బాగానే ఉందనిపిస్తుంది కానీ తెలుగులో ఈ బ్యాక్ డ్రాప్ లో ఇంత నిడివిని భరించడం కష్టం. కానీ ఓటిటి ఆప్షన్ కాబట్టి ఇంట్లోనే చూస్తే వన్ నిరాశ కలిగించే అవకాశాలు తక్కవ