iDreamPost
android-app
ios-app

వయసైపోతోంది నాయకా..!

  • Published Sep 22, 2021 | 9:45 AM Updated Updated Sep 22, 2021 | 9:45 AM
వయసైపోతోంది నాయకా..!

అది ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయం. ఆరు పదుల వయసులో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినా నాడు పార్టీలో చేరినవారంతా యువరక్తమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువకులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముఖ్యంగా టీడీపీకి తొలి నుంచి పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో యువత పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా తొలిసారి బరిలో నిలిచినప్పటికీ విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు.

టీడీపీ వయసుతోపాటు ఆ పార్టీ నాయకుల వయసు కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పార్టీ ఏర్పడి నలభై ఏళ్లకు దగ్గర పడుతుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీలో కీలక సీనియర్‌ నాయకుల వయస్సు 70 ఏళ్లు దాటుతుండగా, చాలా మంది వయస్సు 50, 60లకు పైబడి ఉండడం గమనార్హం. యువత రాకపోవడానికి తోడు ఇప్పటికీ వృద్ధతరం పెత్తనం కొనసాగడం పార్టీకి గుదిబండగా మారుతోంది.

సాధారణంగా ఏ వ్యవస్థలోనైనా అనుభవజ్ఞులు ఉండడం అదృష్టం. ముఖ్యంగా రాజకీయాల్లో సీనియర్ల అవసరం చాలా ఉంటుంది. కాని టీడీపీలో అనుభవజ్ఞులు ఎక్కువగా ఉండడం, కొత్తతరం రాకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీలో పెద్దాయనగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఆయన వయసు 32 ఏళ్లు, ఇప్పుడు 70. తుని నుంచి వరుసుగా ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన యనమలకు ఇప్పుడు అవే తుని రాజకీయాలు కొరుకుపడడం లేదు. వయసు పెరగడం, వరుసకు తమ్ముడు యనమల కృష్ణుడుపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు తుని పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న యనమల కృష్ణుడు వయసు సైతం 65 ఏళ్లకు దగ్గరగా ఉంది.

తూర్పున మరో సీనియర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలోకి ప్రవేశించిన సమయంలో 35 ఏళ్ల వయసు. ఇప్పుడు 75 ఏళ్లు. యువకులుగా టీడీపీలో రాజకీయ జీవతం ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వయసు 67 ఏళ్లు, కాగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు వయసు 69 ఏళ్లు. ఎమ్మెల్యేలుగా, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న బండారు సత్యానందరావు (కొత్తపేట), పిల్లి అనంతలక్ష్మి(కాకినాడ రూరల్‌), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట)లు ఐదు పదుల వయసులో ఉన్నారు.

Also Read : టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా సైకిల్ కుదేలు

ఈ జిల్లాలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ, కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షునిగా ఉన్న జ్యోతుల నవీన్‌, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధూర్‌ బాలయోగి వంటివారు యువతరం ప్రతినిధులుగా ఉన్నారు.

తూర్పుతో పోల్చుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలో పేరొందిన నాయకులు చాలామంది నడివయసులోనే ఉన్నారు. కాని సీనియర్‌ నాయకులుగా ఉన్న ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) (61), మాజీమంత్రి పితాని సత్యనారాయణ (66) వయస్సులో ఉండగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతోపాటు మాజీమంత్రి కె.ఎస్‌.జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు బడేటి కోట రామ్మోహనరావు, గన్ని వీరాంజనేయులు సైతం ఐదు పదుల వయసులో ఉన్నారు.

వారసత్వం కూడా లేదు..

రాజకీయ నాయకులు తాము అధికారంలో ఉన్న సమయంలోనే వారసత్వాన్ని తయారు చేసుకుంటారు. గోదావరి జిల్లాల రాజకీయాల్లో వారసత్వం అనాధిగా వస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తన వారసునిగా కొడుకు లోకేష్‌ను ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, విమర్శలు వ్యక్తమవుతున్నా, పార్టీ సీనియర్ల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా చంద్రబాబు నాయుడు వెనకంజవేయడం లేదు. కాని గోదావరి జిల్లాలో టీడీపీ నాయకులు తమ పిల్లలకు వారసత్వం అప్పగించడంలో వెనకంజలో ఉన్నారనే చెప్పవచ్చు.

ఈ రెండు జిల్లాల్లో జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్‌, దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి, మాజీ కేంద్రమంత్రి కె.యర్రంనాయుడు కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీలు మాత్రమే వారసులుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కొంతమంది నేతల పిల్లలు రాజకీయాల్లో ఉన్నా వారి ఉనికి అంతంతమాత్రంగానే ఉంది.

Also Read : ‘తూర్పు’లో అవకాశాల కోసం వారసుల ఎదురుచూపులు