iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ ని వాడటం ఇలా

  • Published Mar 09, 2021 | 5:06 AM Updated Updated Mar 09, 2021 | 5:06 AM
సూపర్ స్టార్ ని వాడటం ఇలా

మాములుగా ఏదైనా పెద్ద హీరో సినిమాలో ఇతర స్టార్ల రిఫరెన్స్ తీసుకోవడం లేదా వాళ్ళ గురించి ప్రస్తావించడం చాలా అరుదు. నితిన్ ఈ విషయంలో అసలు మొహమాటపడడు. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ సాంగ్స్, వీడియోలు, ఆఖరికి పాటల పల్లవులు కూడా టైటిల్ గా పెట్టుకుని వాడుకున్నాడు. ఇది తనకు చాలా ప్లస్ అయ్యింది కూడా. పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి మద్దతు దొరికింది. అప్పుడెప్పుడో చంద్రలేఖ మూవీలో నాగార్జున హీరో శ్రీకాంత్ ని అభిమానించే ఓ మాములు వ్యక్తిగా కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇలా అందరూ చేయలేరు కానీ సరిగ్గా వాడుకుంటే అందరి దృష్టి మనవైపు పడేలా చేసుకోవచ్చు.

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్ యులో హీరో పాత్ర మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఒక్కడు విడుదల సందర్భంగా మహేష్ వీరాభిమానిగా చైతు రిస్క్ తీసుకుని నిచ్చెన ఎక్కుతూ కటవుట్ కు పాలాభిషేఖం చేసే సీన్ ని షూట్ చేశారు. యూనిట్ లో సభ్యులో లేక జూనియర్ ఆర్టిస్టో ఎవరో దీన్ని సెల్ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దెబ్బకు ఆ వీడియో కాస్తా వైరల్ అయిపోయి తెగ షికార్లు చేసేస్తోంది. అందరికి చేరిపోతుంది.

ఇది చూశాక మహేష్ ఫ్యాన్స్ తమ హీరోని ఇంతగా అభిమానించే క్యారెక్టర్ చైతు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను మొదటి రోజే చూస్తామని అప్పుడే ట్వీట్లు కూడా పెట్టేస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఒక్కడు రిలీజ్ అంటే ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం 2003లో వచ్చింది. ఈ లెక్కన చూస్తే థాంక్ యు కథాక్రమం అక్కడి నుంచి జరుగుతుందన్న మాట. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో టైం లైన్ కాన్సెప్ట్ తో మేజిక్ చేసే విక్రమ్ కుమార్ ఇందులో కూడా ఏదో విభిన్నంగానే ప్రయత్నిస్తున్నారట. ఏప్రిల్ 16న విడుదల కాబోతున్న లవ్ స్టోరీ తర్వాత ఈ థాంక్ యు కూడా ఇదే ఏడాది విడుదల కానుంది