భారత జాతిపిత మహాత్మా గాంధీ హత్య చేయబడలేదట… ప్రమాదంలో చనిపోయారట.. సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయి ఇలా అని ఉంటే ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదేమో. ఒకవేళ సోషల్ మీడియాలో ఇలాంటి వాదన చేసినా విపరీతమైన వాదోపవాదాలు గొడవలు జరిగి ఉండేవి. కానీ ఈ పొరపాటు చేసింది ఆకతాయిలు కాదు. సాక్షాత్తు ఒడిస్సా పాఠశాల విద్యాశాఖ.. ఒడిస్సా రాష్ట్రంలో పాఠశాలల కోసం రూపొందించిన రెండు పేజీల కరపత్రంలో ఈ పొరపాటు చోటు చేసుకుంది. దీనివల్ల పెద్ద దుమారమే రేగింది. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని, గాడ్సే అనే వ్యక్తి ప్రజలందరూ చూస్తుండగానే హత్య చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. మహాత్మ గాంధీ హత్య విషయంలో గాడ్సే ఉరి తీయబడ్డాడు అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేలా ఒడిస్సా విద్యాశాఖ కరపత్రాన్ని రూపొందించడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే, “ఆమా బాపూజీ: ఏక్ ఝలాకా” అనే రెండు పేజీల కరపత్రాన్ని , ఒడిస్సా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. కానీ ఇందులో మహాత్మా గాంధీ హత్య చేయబడలేదని, ప్రమాదంలో చనిపోయారని ప్రచురించారు. దీనివల్ల రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ మంత్రి స్పందిస్తూ,ఈ పొరపాటు చేసింది ఎంతటి వారైనా సరే వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికే పాఠశాలలో పంపిణి చేసిన కరపత్రాలను ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు .
మహాత్మా గాంధీపై బురద జల్లడానికే ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేస్తున్నారని ప్రజా సంఘాలు విశ్లేషకులు మండిపడుతున్నారు.‘‘గాంధీ విలువల గురించి ఆలోచనా విధానం గురించి ముఖ్యమంత్రి చాల గొప్పగా మాట్లాడతారు. ఆయన ప్రభుత్వంలోని ఓ విభాగమే గాంధీ రోడ్డు ప్రమాదంలో మరణించారని కరపత్రాలను విడుదల చేస్తోంది. ఇది చాలా హానికరమైన చర్య’’ అని సమదృష్టి ఎడిటర్ సుధీర్ పట్నాయకర్ అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి