iDreamPost
android-app
ios-app

అంతా రాజ్యాంగబద్ధమే !గవర్నర్ ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయొచ్చు అంటా .!

  • Published Nov 25, 2019 | 3:56 AM Updated Updated Nov 25, 2019 | 3:56 AM
అంతా రాజ్యాంగబద్ధమే !గవర్నర్ ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయొచ్చు అంటా .!

దేశంలో అందరికన్నా ముందు నిద్రలేచేది ఎవరు?
1. పాలవాడు 2. పేపర్ బాయ్ 3. కోడి పుంజు 4. మహారాష్ట్ర గవర్నర్ 5. రాష్ట్రపతి

నిన్నటి నుంచి ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.దీని సమాధానం స్పష్టమే!

గవర్నరుకు విచక్షాణాధికారం ఉంది ,ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినైనా పిలవవొచ్చు అని వాదనకు సుప్రీంకోర్టు జడ్జి రమణ “గవర్నర్ ఎవరినైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటానికి లేదు,ఆయనకు నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నాయని” స్పందించారు.

గతంలో చూసిన అనేక కేసుల తరువాత ప్రతి వ్యవస్థ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి,గవర్నర్ ,స్పీకర్ నిర్ణయాలో కోర్టు కలగచేసుకోలేదు అన్నది బలం లేని వాదన. నిన్న సుప్రీం కోర్టు చాలా చిన్న ఆధారాలు అడిగింది.
1. రాష్ట్రపతి పాలనను ఎత్తి వేసి, దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ సిఫారసు చేసిన లేఖ
2. తనకు మెజారిటీ ఉందంటూ గవర్నర్‌కు ఫడణవీస్‌ సమర్పించిన లేఖ.. ఈ రెండు లేఖలను ఈ ఉదయం 10:30 లోపల అందచేయాలని సుప్రీంకోర్టు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది .

రాజ్యాంగం ప్రకారం లేఖలు అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించలేదు కానీ ఈ లేఖలు అందచేయటానికి రెండు రోజుల సమయం కావాలని కోరాడు. రాజ్యాంగం ప్రకారం లేఖలు అవసరం లేదు అని వాదించి ఉంటే చర్చ మరో రకంగా ఉండేది. లేఖలు ఉండి ఉంటే వాటిని కోర్టుకు సమర్పించటానికి రెండు రోజుల సమయం అవసరం ఏమిటన్న ప్రశ్న వస్తుంది? దీన్నిబట్టి మహారాష్ట్ర గవర్నర్ ఎంత రాజ్యాంగ బద్దంగా వ్యవహరించింది తెలుస్తుంది.

23 వ తారీఖు శనివారం ఉదయం 5:47 నిముషాలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ గజెట్ విడుదలయ్యింది.

రాష్ట్రపతి పాలన ఎత్తివేయటానికి కేంద్ర క్యాబినెట్ సిపార్సు ఉండాలి. కానీ గత శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరగలేదు,మరి రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేశారు? దీనికి సమాధానం Government of India (Transaction of Business) Rules (12).Rule(12) ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేయమని రాష్ట్రపతికి సిపార్సు చెయ్యవొచ్చు. మొన్న జరిగింది ఇదే. రూల్ నంబర్ 12 అనేది అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు వాటిని సరిదిద్దడానికి ప్రధానమంత్రికి అధికారం ఇస్తూ రూల్ నంబర్ 12 ని ఏర్పాటు చేసారు . గతంలో 1975 లో ఇందిరా గాంధీ, ఈ రూల్ నంబర్ 12 ని ఉపయోగించి ఎమర్జెన్సీని విధించారు. తిరిగి ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మోడీ ఉపయోగించారు. రూల్ 12 ఉపయోగించేంత విపత్కర విధించేంత పరిస్థితులు మహారాష్ట్రలో ఉన్నాయా ?

ఒక కోణంలో మొత్తం వ్యవహారం రాజ్యాంగబద్దంగా జరిగినట్లు కనిపిస్తుంది,మరో కోణంలో అర్ధరాత్రి హడావుడి ఎందుకు? NCP చీలిక నేత అజిత్ పవార్ 8 మంది ఎమ్మెల్యేలను తనతో తీసుకెళ్లినంత మాత్రాన NCP బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని గవర్నర్ ఎలా నమ్మారు?ఒక పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీర్మానం ఆధారంగానే ఆ పార్టీ మద్దతు ఇస్తుందని గవర్నర్ నమ్మాలి. ఇక్కడ ఆయన విచక్షణాధికారం పనిచేయదు. పార్టీలో చీలిక వొచ్చినప్పుడు ఏది అసలు పార్టీ అన్నది తేలకుండా ,ఎదుటి పక్షం వాదన వినకుండా నేను నమ్మాను అనటం రాజ్యాంగబద్ధంగా చెల్లదు. ఒక పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీర్మానమే ఆధారంగానే ఆ పార్టీ మద్దతు ఇస్తున్నట్లుగా పరిగణించాలి. లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు పార్టీకి ప్రతినిధే కానీ సర్వహక్కులున్న నిర్ణయదారుడు కాదు.

ఫడణవీస్‌ ప్రభుత్వానికి బలం ఉందని నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా గవర్నర్ ఆయన బలాన్ని ఒకటి లేక రెండు రోజుల్లో నిరూపించుకోమని ఆదేశించి ఉండాలసింది,నవంబరు 30 వరకూ గడువు ఇవ్వటం హౌర్స్ ట్రేడింగ్ కు అవకాశం ఇవ్వటమేనన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో కర్ణాటక విషయంలో సుప్రీం కోర్టు గవర్నర్ నిర్ణయంలో కలగచేసుకొని 48 గంటలలో బలనిరూపణ చేసుకొమ్మని సంగతి దృష్టిలో పెట్టుకొని ఉండవలసింది.

బీజేపీ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మరీ విచిత్రంగా వాదించాడు. ఆయనకు ఆదివారం విచారణ ఏమిటో అర్థం కాలేదంట. అసలు ఆదివారం ఎలాంటి విచారణ ఉండకూడదు .అని కూడా న్నారు. అంట సీనియర్ న్యాయవాదికి “హౌస్ మోషన్ ” గురించి సృహ లేకపోవటం ఆశ్చర్యకరం. గతంలో ఈ ముకుల్‌ రోహత్గీ అనేకసార్లు అత్యవసర కేసని ఆదివారం కోర్టు మెట్లెక్కాడు.

కోర్టులో ఏమవుతుంది?
సుప్రీం కోర్టు జడ్జి అడిగిన రెండు లేఖలు ఇస్తారా? ఇదొక్కటే ఆసక్తికరం, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టకపోవచ్చు కానీ విశ్వాసపరీక్ష గడువును తగ్గించవచ్చు.

ఈ విచారణ సందర్భంగా “నన్ను ప్రధానమంత్రిని చేయండి అని ఓ సామాన్యుడు కూడా కోరవచ్చు” అని సుప్రీంకోర్టు జడ్జి రమణ అన్నారు. భవిష్యత్తులో ఏవో రెండు మూడు చీలిక వర్గాలు మద్దతు ఇచ్చాయని, రేసులో లేని నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చు,గవర్నర్ నమ్మితే చాలు.. మిగిలింది కోర్టుకు వెళ్లి తేల్చుకోవటమే.

రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రమాణస్వీకారం చెయ్యవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ అర్ధరాత్రో ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు అని గవర్నర్ ప్రకటించవచ్చు కూడా! అంతా రాజ్యాంగబద్ధమే !!!