మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై శివసేన,కాంగ్రెస్, ఎన్సీపీ ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయని త్వరలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుందని వార్తలు వస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా శివసేనకు ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి, కాంగ్రెస్ మరియు ఎన్సీపీ పార్టీలు చెరొక ఉప ముఖ్యమంత్రి తీసుకోనున్నాయని అంతేకాకుండా శివసేనకు 16, ఎన్సీపీకి 14, కాంగ్రెస్ కు 14 మంత్రి పదవులు దక్కేలా ఒప్పందం కుదిరిందని సమాచారం సమాచారం.
ఎన్సీపీ కీలక నేత నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ‘వారు (శివసేన) అవమానానికి గురయ్యారు. వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది’ అని తెలిపారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతలకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ సమయం ఇచ్చినట్లు మీడియాకి తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ఐదేళ్లపాటు పూర్తిగా పదవిలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. దీనితో అనేక ఊహాగానాలకు తెరదించినట్లయింది. గతంలో మహారాష్ట్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఉన్న పార్టీల మధ్య సమైక్యత కుదరకపోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేయడం దాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మొదలయిన విషయం తెలిసిందే.