iDreamPost
android-app
ios-app

Maha Ex Home Minister -మహా మాజీ హోంమంత్రి అరెస్ట్.. జనాల్లో ఎంత పాపులారిటీ ఉన్నా, ఆ తప్పుతో దొరికేసి!

Maha Ex Home Minister -మహా  మాజీ హోంమంత్రి అరెస్ట్.. జనాల్లో ఎంత పాపులారిటీ ఉన్నా, ఆ తప్పుతో దొరికేసి!

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సోమవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అరెస్టు చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌పై ఈడీ అధికారులు అధికారిక సమాచారం అందించారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనకు నవంబర్‌ 6 వరకు కస్టడీ విధించారు. ఆ తర్వాత అనిల్ దేశ్‌ముఖ్‌కు మంగళవారం వైద్యం కూడా అందించారు. ఈడీ అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం, అనిల్ దేశ్‌ముఖ్‌ను దోపిడీ మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టు చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను విచారించేందుకు ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యవ్రత్ కుమార్ స్వయంగా ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్నారు. అయితే అంతకుముందు అనిల్ దేశ్‌ముఖ్‌కి ఈడీ సమన్లు పంపి విచారణకు పిలిచింది కానీ అనిల్ దేశ్‌ముఖ్ విచారణకు సహకరించడం లేదని అందుకే అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ అధికారులు అతడిని నిరంతరం విచారిస్తూ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసలు అనిల్ దేశ్‌ముఖ్ ఎవరు, ఏ కేసులో అరెస్ట్ అయ్యారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. కాబట్టి ముందుగా అనిల్ దేశ్‌ముఖ్ ఎవరో తెలుసుకుందాం.

అనిల్ దేశ్‌ముఖ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వంలో దేశ్‌ముఖ్ హోం మంత్రిగా పని చేశారు. విదర్భ ప్రాంతానికి చెందిన అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కటోల్ ప్రాంతానికి చెందినవాడు. కటోల్ ప్రాంత ప్రజల్లో ఆయనకు మంచి పట్టుంది. ముందు నాగపూర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన ఆయన 1995లో ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దేశ్‌ముఖ్ తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడే ఆయన బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు పలికి మంత్రిగా కూడా పని చేశారు. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1999, 2004, 2009 మరియు 2019 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లారు దేశ్‌ముఖ్‌, తన రాజకీయ జీవితం ఒక్కసారి మాత్రమే ఓటమి పాలు అయ్యారు అంటే ఆయనకు ప్రజల్లో ఎంతటి పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్ధవ్ ప్రభుత్వాని కంటే  ముందు 2004లో పీడబ్ల్యూడీ మంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో, 2009 నుండి 2014 వరకు, అతను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో 5557 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మహారాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఈడీ అధికారుల ప్రకారం, మహారాష్ట్ర పోలీసులు రూ. 100 కోట్ల లంచం రికవరీ చేయాలనే టార్గెట్ పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో దేశ్‌ముఖ్ మీద కేసు నమోదయింది. ముంబైలోని జూనియర్ పోలీసు అధికారుల ద్వారా పబ్‌లు, బార్‌లు మరియు రెస్టారెంట్ల నుండి దేశ్‌ముఖ్ నెలకు రూ. 100 కోట్ల రికవరీని ఆదేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత ఈ కేసులో ఇడి ప్రవేేశించింది. ఈ కేసులో దేశ్‌ముఖ్ పర్సనల్ అసిస్టెంట్ (పిఎ) కుందన్ షిండే, ప్రైవేట్ సెక్రటరీ (పిఎస్) సంజీవ్ పలాండేలను ఇప్పటికే అరెస్టు చేశారు. దేశ్‌ముఖ్‌ను కూడా అరెస్టు చేస్తారనే భయం ముందు నుంచి నెలకొనగా అదే నిజం అయింది. ఈ కేసులో దేశ్‌ముఖ్‌కు ఈడీ ఐదుసార్లు సమన్లు ​​జారీ చేసినా ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దేశ్‌ముఖ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపరమైన రక్షణ కోసం ప్రయత్నిస్తూ నెలల తరబడి ఈడీ నుంచి మిస్సవుతూనే ఉన్నారు. గత వారం బాంబే హైకోర్టు ఈడీ సమన్లను రద్దు చేయడానికి నిరాకరించడంతో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావడం మినహా ఆయనకు వేరే మార్గం లేదు. దీంతో సోమవారం హఠాత్తుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరైన దేశ్‌ముఖ్ ను పన్నెండు గంటల పాటు ప్రశ్నించి అరెస్ట్ చేసింది.

Also Read : By Polls -ఉప ఎన్నికలు.. బిజెపి కి కట్టా మీటా