మహా రాష్ట్రలో పార్టీల మధ్య పొత్తు కుదిరి ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎం పదవి తనకు ఇవ్వాలని ఓ రైతు ఆ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా మహారాష్ట్రలో ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సీఎం సీటు కోసం బీజేపీ-శివసేన మల్లగుల్లాలు పడుతుండటంపై మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ రైతు గవర్నర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి శ్రీకాంత్ విష్ణు గడాలే అనే రైతు లేఖ రాశారు.
ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు నాశనం అయ్యాయని.. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వం లేకపోవడంపై శ్రీకాంత్ లేఖలో ఆవేదనను తెలియజేశాడు. ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఆ పార్టీల సమస్య తీరేంత వరకు ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలని శ్రీకాంత్ విష్ణు గడాలే కోరారు. ముఖ్యమంత్రిగా రైతుల సమస్యలను తాను తీరుస్తానని, వారికి న్యాయం చేకూరుస్తానని చెప్పారు.