iDreamPost
iDreamPost
అంతా గందరగోళం. ఏమి జరుగుతుందో తెలిసే లోగా అంతా జరిగిపోయిందంటూ అజిత్ పవార్ ప్రకటన. కానీ అంతనలోనే మళ్లీ మరో ట్విస్ట్. ఇంకా చాలా ఉంది అంటూ తెరమీదకు శరద్ పవార్. శివసేన సుప్రీంకోర్ట్ కి వెళ్లింది. బీజేపీ క్యాంపులకు తెరలేపింది. కాంగ్రెస్ కళ్లప్పగించి చూస్తోంది. మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయమన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. బాబాయ్-అబ్బాయిలు పవర్ గేమ్స్ తో బీజేపీ మునుగుతుందా, తేలుతుందా అన్నదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. అదే సమయంలో శరద్ పవర్ నిజంగా దోబూచులాడుతున్నారా లేక దొంగాట అడుతున్నారా అన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మాత్రం 2014 నాటి అనుభవాన్ని పునరావృతం చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నప్పటికీ అది నెరవేరుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్ఫెన్స్.
అనిశ్ఛితికి అసలైన అడ్రస్ గా కనిపించే మహారాష్ట్ర రాజకీయాల్లో గత శాసనసభలో కూడా దాదాపు ఇలాంటి సందిగ్ధమే ఏర్పడింది. అప్పట్లో బీజేపీకి శివసేన మద్ధతు ప్రకటించే విషయంలో పట్టుదలకు పోయింది. దాంతో సభలో బలనిరూపణ దేవేంద్ర ఫడ్నవిస్ మొదటి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. దానిని నుంచి గట్టెక్కేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. చివరకు ఎన్సీపీతో జతగడుతున్నట్టు ప్రకటించింది. ఆపార్టీ తమకు మద్ధతు ఇస్తున్నట్టు చెప్పుకుంది. తమకు అలాంటి ఆలోచన లేదని నాడు ఎన్సీపీ చెబుతున్నా బీజేపీ మాత్రం భిన్నంగా ప్రకటనలు జారీ చేస్తూ చివరకు సభలో తగిన బలం లేని సమయంలో కూడా గట్టెక్కేసింది. దానికి గానూ మూజువాణీ ఓటుని ఆయుధంగా మార్చుకుంది. ఎమ్మెల్యేల సంఖ్య లెక్కించకుండా మూజువాణీ పేరుతో బలనిరూపణ పూర్తి చేయడం ద్వారా సభలో గట్టెక్కింది. దీనిని పలువురు నిరసించినా ప్రక్రియ పూర్తికావడంతో ఆ తర్వాత శివసేన కూడా దిగివచ్చి, ప్రభుత్వంలో భాగస్వామి అయిపోయింది.
Aldo Read :మహా మలుపుల రాజకీయం, అదే అసలు కారణం
అర్థరాత్రి పరిణామాలతో ఇప్పుడు ఏం జరుగుతుంది..!
ఒకప్పుడు అర్థరాత్రి రాష్ట్రపతి పాలన విధించి, పలు ప్రభుత్వాలను బర్త్ రఫ్ చేసిన అనుభవాలు ఈ దేశ ప్రజలకున్నాయి. కానీ ఈసారి అర్థరాత్రి పూట రాష్ట్రపతి పాలన ఎత్తేసి, తమ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న కొత్త చరిత్రకు కమలనాధులు శ్రీకారం చుట్టారు. దానికి అనుగుణంగా జిస్కా గవర్నర్- ఉస్కి సర్కార్ అనే చందంగా గవర్నర్ భగత్ సింగ్ కోస్కారి వ్యవహరించారు. తెల్లవారు జామున తీసుకున్న నిర్ణయాలతో కోడికూసేవేళ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి క్లియరెన్స్ వచ్చింది. ఉ.5.45 ని.లకు రాష్ట్రపతి పాలన ఎత్తేసి, మీడియాను కూడా ఆహ్వానించకుండా ఉ..7.30కి ప్రమాణ స్వీకారం చేసిన తొలి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సభలో బలం నిరూపించుకోవాల్సిన ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇవ్వడం ద్వారా గవర్నర్ మరింత ఉదారంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఇచ్చిన అనుభవాన్ని గమనిస్తే బేరసారాలకు తగ్గట్టుగా ఈసారి గడువు నిర్ణయించడం విశేషం.
శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలకు షాక్ ఇచ్చి అనూహ్యంగా పీఠంపై కొలువుదీరిన బీజేపీ కి ఇప్పుడు బెంగ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర సభలో మొత్తం 288 మంది సభ్యులకు గానూ 145 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అందులో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలున్నారు. రెబల్స్, ఇతరుల మద్ధతు కలిపితే అది 112గా ఉంటుందని సమాచారం. ఇక బలనిరూపణకు మరో 33 మంది సభ్యుల అండ కావాల్సి ఉంటుంది. ఎన్సీపీ మద్ధతు సంపూర్ణంగా లభిస్తే ఢోకా ఉండదు. ప్రస్తుతానికి ఘీంకరిస్తున్న శరద్ పవర్ చివరి వరకూ ఇలానే ఉంటారనే గ్యారంటీ లేదు. దాంతో ఎన్సీపీ అండ బీజేపీకి దక్కుతుందా.. లేక కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేని శివసేనలోకి కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడం లేదా ఇతర రూపాల్లో బీజేపీ గట్టెక్కేందుకు తోడ్పడతారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. కానీ ప్రస్తుతానికి బీజేపీని బాబాయ్-అబ్బాయ్ రూపంలో బాగా టెన్షన్ పెడుతున్నారు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఏకంగా ఉపముఖ్యమంత్రి సీటులో ఆశీనులయ్యారు. కానీ తనకు తోడుగా కేవలం 9మందిని మాత్రమే ఢిల్లీలో బీజేపీ క్యాంపుకి చేర్చగలిగినట్టు తెలుస్తోంది. అదే నిజమయితే బీజేపీ ప్రభుత్వానికి బోలెడు చిక్కులు తప్పవు. బలనిరూపణకు ఇంకా 25 మంది దాదాపుగా అవసరమయ్యే వేళ అది పెద్ద సమస్య అవుతుంది. అంతేగాకుండా అజిత్ బాబాయ్ శరద్ పవార్ వెంట ఉన్నట్టుగా చెబుతున్న 42 మందికి తోడుగా ఢిల్లీ వెళ్లిన వారిలో మరికొందరు వెనక్కి వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అప్పుడు బీజేపీకి మరిన్ని తలనొప్పులు ఎదురవుతాయి. ఇదే ఇప్పుడు కమలనాధులను కలవరపరుస్తోంది.
సీఎం సీటు అందినట్టే అంది, చేజారిపోయిన ఉద్దవ్ ఠాక్రే రగిలిపోతున్నారు. తనకు దక్కాల్సిన పదవి బీజేపీ ఎగరేసుకోవడం ఆయన సహించలేకపోతున్నారు. దాంతో బీజేపీ మీద ఆయన మరింతగా మండిపడుతున్నారు. శివసేనలో చీలిక తప్పదనే సంకేతాలు వస్తున్న తరుణంలో శివాజీకి వెన్నుపోటు పొడిచినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు అంటూ ఆయన ప్రశ్నిస్తూనే శివసేనను చీల్చాలని చూస్తే సహించబోమన్నారు. మహారాష్ట్ర రగిలిపోతుందంటూ హెచ్చరించారు. అంతటితో సరిపెట్టుకుండా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి, తగినంత బలంలేని వారితో ప్రమాణస్వీకారం చేయించారంటూ శివసేన సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించింది. ఆదివారం కూడా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు కోర్ట్ అంగీకరించింది. కోర్ట్ తీర్పులు ఎలా ఉన్నప్పటికీ రాబోయే వారం రోజుల పాటు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం చేజారిపోకుండా చూసుకోవడం, కాంగ్రెస్ సహకారం నిలిపుకోవడం శివసేనకు ప్రస్తుతానికి ప్రధాన సవాల్ గా ఉంది.
మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితికి అసలు కారణం బీజేపీ అధిష్టానం ఎత్తులకు ఎన్సీపీ తలొగ్గడమే. అందులోనూ 70వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరోపించడమే కాకుండా మహారాష్ట్ర ఏసీబీ విచారణ సాగించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అజిత్ పవార్ తీరు ఈ పరిణామాలకు దోహదం చేసిందనే చెప్పవచ్చు. అజిత్ పవార్ పై రెండు కీలక కేసులున్నాయి. వాటిలో మొదటి కేసు మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకుది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు అజిత్ పవార్ పై ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో 25 వేల కోట్ల రూపాయలు అజిత్ పవార్ అక్రమంగా వాడుకున్నారని అభియోగం. ఈ కేసును ఎకనామిక్ అపెన్స్ వింగ్ దర్యాప్తు చేస్తోంది. శరద్ పవార్ కూడా ఈ కేసులో నిందితుడు. ఇక రెండవ కేసు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్సీపీ మద్దతు ఇస్తున్నప్పుడు, అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలోనే అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ అజిత్ పవార్ 70 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మహారాష్ట్ర హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన అఫిడవిట్ కూడా గత ఏడాది దాఖలు అయ్యింది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్ ని పావుగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని చెబుతున్నారు.
కానీ శరద్ పవార్ అడ్డం తిరగడంతో అసలు కథ మొదలయ్యింది. పవర్ గేమ్స్ లో పవారులిద్దరూ చెరో దారి పట్టినట్టు కనిపిస్తున్న తరుణంలో శరద్ పవార్ తీరు మీద నేటికీ పలు అనుమానాలున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీకి మద్దతు ప్రశ్నే లేదని చెబుతున్నారు. తద్వారా తన వెంట మూడింట రెండొంతుల మందికి పైగా ఎమ్మెల్యేలను సమీకరించుకోవడం ద్వారా అబ్బాయ్ ఆటకు బ్రేకులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ స్టాండ్ మార్చుకోకుండా చివరి వరకూ ఇదే ధోరణిలో కొనసాగితే బీజేపీ కి షాక్ తప్పదనే అంచనాలున్నాయి.
Also Read: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి
సోషల్ మీడియాలో సెటైర్లుగా వినిపిస్తున్నప్పటికీ నిజానికి కాంగ్రెస్,శివసేన, ఎన్సీపీ కూటమికి 170 మంది వరకూ ఎమ్మెల్యేల మద్ధతు ఉంటే బీజేపీకి సీబీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి మహారాష్ట్ర అసెంబ్లీలో 62% అంటే 176 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 40% శాతం మంది అంటే 113 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి. దాంతో అలాంటి వారిలో తమకు అవసరమైనంత మేరకు దారికి తెచ్చుకోవడం మోడీ-షా బృందానికి పెద్ద కష్టం కాబోదని కూడా కొందరు చెబుతున్నారు. అయినప్పటికీ బీజేపీ ముందు మహారాష్ట్ర పెద్ద సవాల్ గా మారుతోంది. పరిస్థితిలో ఏ చిన్న ఏడా వచ్చినా బీజేపీ పరువు ముంబై సాక్షిగా అరేబియా సముద్రం పాలవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే గోవా, ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటకలో అనేక కథలు నడిపి కుర్చీ ఎక్కేసిన పార్టీ మహారాష్ట్ర సభలో మొనగాడని నిరూపించుకోలేక చతికిలపడితే మాత్రం దాని ప్రభావం దేశమంతా ఉంటుందనడంలో సందేహం లేదు. దానికి తగ్గట్టుగా కసరత్తులు చేస్తున్నా చివరకు వ్యవహారం కొలిక్కి వస్తుందో లేదోననే టెన్షన్ సర్వత్రా ఉంది.