iDreamPost
android-app
ios-app

మద్యం కావాలా?కిరాణా షాపులో దొరుకుతుంది చూడండి

  • Published Jan 28, 2022 | 12:47 PM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
మద్యం కావాలా?కిరాణా షాపులో దొరుకుతుంది చూడండి

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు పూర్తిగా తలుపులు తెరిచింది. ఈ మేరకు కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం మహారాష్ట్రలో ఇక నుంచి కిరాణా షాపుల్లోనూ మద్యం లభిస్తుంది. ఆదాయం పెంచుకోవడం, పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా ఆ వివరాలు వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం సూపర్ మార్కెట్లు, పెద్ద కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలకు అనుమతులు జారీ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, ఇతర పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

వైన్ విక్రయాలను ప్రోత్సహించేందుకు

రాష్ట్రంలో చిన్న,మధ్యతరహా వైన్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి నవాబ్ మాలిక్ సమర్థించుకున్నారు. వెయ్యి చదరపు గజాల విస్తీర్ణం కలిగిన కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు మద్యం విక్రయాలకు లైసెన్సులు ఇస్తామన్నారు. ఏడాదికి రూ.5 వేలు ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైన్ షాపులు, షాపింగ్ మాల్స్ లోని ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే ఆల్కహాల్ బేస్డ్ వైన్, బీర్ అమ్మకాలకు అనుమతి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అన్ని కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లలోనూ మద్యం విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. వీటికి ప్రత్యేక కౌంటర్లు కాకుండా మిగతా సరుకుల మాదిరిగానే బహిరంగంగా షోకేసుల్లో పెట్టి అమ్మకాలు సాగించవచ్చు. పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు పదేళ్లపాటు వాటిపై జీఎస్టీ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

30 శాతం పెరగనున్న అమ్మకాలు

ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వైన్ ఉత్పత్తిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వైన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. దేశంలో విక్రయించే వైన్ లో దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతోంది. రాష్ట్రంలో సుమారు పెద్ద వైన్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా దాదాపు అవన్నీ నాసిక్ జిల్లాలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అహ్మద్ నగర్, సాంగ్లి, పూణే, షోలాపూర్, ప్రాంతాల్లో చిన్న తరహా వైన్ యూనిట్లు చాలా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల మద్యం అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ వైన్ పేరుతో ప్రభుత్వం మహారాష్ట్రను లిక్కర్ రాష్ట్రంగా మార్చేయాలని చూస్తోందని విమర్శించారు.