నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా విదేశీ ప్రముఖులు ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రముఖుల ట్వీట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకంటూ విదేశీ ప్రముఖులు చేసిన అభ్యంతరకరమైన ట్వీట్లను అనుమతించడంపై ట్విటర్‌కు కేంద్రం ప్రభుత్వం నోటీసులు పంపించింది.
ఇక్కడవరకూ బానే ఉంది. విదేశీ ప్రముఖులు చేసిన ట్వీట్లకు వ్యతిరేకంగా మనదేశ ప్రముఖులు ట్వీట్లు చేయడంతో ట్విట్టర్ వేదికగా ట్వీట్ల యుద్ధం మొదలైంది. ప్రముఖ పాప్ సింగర్ రిహాన,పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బెర్గ్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, బ్రిటన్ ఎంపీ తన్మన్ జీత్ సింగ్ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్స్ చేయడంతో వారికి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రైతులను ఉగ్రవాదులతో పోల్చగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, కంగనా రనౌత్, క్రికెటర్‌లు సచిన్ టెండూల్కర్,విరాట్ కోహ్లీ,ప్రజ్ఞాన్ ఓజాలు,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాంటి ప్రముఖులు భారత అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరమని భారత దేశానికి సమస్య పరిష్కరించుకునే సత్తా ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాగా మానవ హక్కులను దేశ అంతర్గత వ్యవహారం అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు విరుచుకుపడగా మరికొందరు భారత సెలబ్రిటీలను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. కాగా స్వదేశీ ప్రముఖులంతా ఎవరో చెప్పినట్లు ఒకే సమయంలో ట్వీట్ చేయడంపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒకేసారి ఎవరో చెప్పినట్లు అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ లాంటి ప్రముఖులు ఒకే ట్వీట్ ను కాపీ పేస్ట్ చేయడం ‘ఇండియా టుగెదర్’ అంటూ ఒకే విధంగా స్పందించడం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా, రైతు ఉద్యమంలో ఎప్పుడూ స్పందించని క్రికెటర్లు ఒక్కసారిగా విదేశీ ప్రముఖులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడంతో ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా కొందరు స్పందించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు చేసిన ఒకే తరహా ట్వీట్లపై సందేహం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయడంతో మహారాష్ట్ర హోంశాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రముఖులు చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర దర్యాప్తునకు ఆదేశించడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినట్లు ఒకే తరహా ట్వీట్ చేయడం వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ ట్వీట్ల విషయంలో లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు సావంత్ ధ్రువీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జే షా బీసీసీఐకి సెక్రెటరీగా ఉన్నందునే క్రికెటర్లకు ట్వీట్లు చేయాలని ఆదేశాలు అందాయని అందుకే క్రికెటర్లు విదేశీ ప్రముఖులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మహారాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ట్వీట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సెలెబ్రెటీల ట్వీట్ల వెనుక ఎవరైనా రహస్య ఆదేశాలు ఇచ్చారా లేదా అన్న విషయాన్ని మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ కనిపెడుతుందా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.