Idream media
Idream media
తొలుత ఢిల్లీ.. ఆ తర్వాత రాజస్థాన్.. తాజాగా మహారాష్ట్ర.. ఇలా రాష్ట్రాలు వేరైనా, కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి, గవర్నర్ ల మధ్య వార్ నడుస్తోంది. పలు అంశాల్లో విబేధాలు తలెత్తడం సాధారణంగా మారింది. ఒకరు సై అంటే.. మరొకరు నై అంటున్నారు. ఈ తరహా ఘటనలు చాలా రాష్ట్రాలలో కనిపిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధినేత అయితే.. గవర్నర్ రాష్ట్రానికి అధినేతగా వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇరువురి పాత్ర కూడా కీలకమే. అటువంటి ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలలో విభిన్నంగా వ్యవహరిస్తుండడం ఇతర అంశాలపై ప్రభావం చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో మంటలు
మహారాష్ట్ర లో ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను తెరిచే విషయంలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాక్రేల మధ్య వివాదం నడిచింది. ఒకరిపై మరొకరు సీరియస్ కామెంట్లు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఆలయాలను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవడంపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘‘మీరు సడెన్ గా సెక్యులర్ గా మారారా?” అని సీఎం ఉద్ధవ్ ను ప్రశ్నించారు. ‘‘నాకెవ్వరూ హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని గవర్నర్ కామెంట్ కు సీఎం కౌంటర్ ఇచ్చారు. కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో మార్చి నుంచి గుళ్లు, ఇతర ప్రార్థనా మందిరాలను మూసేశారు. అయితే ఆ తర్వాత అన్ లాక్ లో భాగంగా కేంద్రం వాటిని ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలే. గుళ్లను ఓపెన్ చేయాలని బీజేపీ నిరసనలు చేపట్టడం, ఆ తర్వాత గవర్నర్ లెటర్ రాయడంతో.. గవర్నర్ ఆఫీస్ బీజేపీ అజెండాను అమలు చేస్తోందని శివసేన ఆరోపించడం.. ఇలా విషయం పలు వివాదాలకు దారి తీసింది.
లేఖ.. ప్రతి లేఖలు
కరోనా సడలింపుల నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చే విషయమై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాస్తూ.. ‘‘మీరు బలమైన హిందుత్వవాది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయోధ్యను సందర్శించి రాముడిపై మీకున్న భక్తిని చాటుకున్నారు. ఏకాదశి రోజున పందర్ పూర్ లోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు” అని కొశ్యారీ అందులో పేర్కొన్నారు. అలాగే ఆలయాల రీఓపెన్ ను వాయిదా వేయమని దేవుడి నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? లేక సెక్యులర్ పదాన్ని ద్వేషించే మీరు.. సడెన్ గా సెక్యులర్ గా మారిపోయారా?” అని కొశ్యారీ సీఎంను ప్రశ్నించారు. దీనికి ఉద్ధవ్ థాక్రే గట్టిగానే బదులిచ్చారు. ఆయన గవర్నర్ కు రిప్లై లెటర్ పంపించారు. తనకు ఎవరి దగ్గరి నుంచీ హిందుత్వ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే ఆలయాలు, ప్రార్థనా మందిరాల రీఓపెన్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ లేఖలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికీ వారి లేఖలపై చర్చలు జరుగుతున్నాయి.