మహారాష్ట్ర నూతన శాసనసభ బుధవారం ఉదయమే ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఉదయం ప్రమాణస్వీకారం చేయించారు. మాజీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్య థాకరే, రోహిత్ పవార్ లు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధ్యక్షుడు ఆదిత్యఠాక్రే తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన ఎంపీ సుప్రియా సూలే కొత్త సభ్యులతో కలిసి కోలాహలం చేశారు.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినంత తరువాత పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూటమి ఎమ్మెల్యేలకు ఆత్మీయ స్వాగతం పలికారు. బీజేపీతో కలిసేందుకు సిద్ధమై, మనసు మార్చుకుని వచ్చిన అజిత్ పవార్, అసెంబ్లీకి వచ్చిన వేళ, ఆయన్ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. మళ్లీ సొంతగూటికి వచ్చిన అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు.
సుప్రియా సూలే శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వద్దకు కూడా వెళ్లి పలకరించారు. పలువురిని పేరుపేరునా పలకరించారు. మాజీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, సంకీర్ణ ప్రభుత్వంపై ఎన్నో బాధ్యతలున్నాయని, ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా నిన్న బాధ్యతలు స్వీకరించిన కాళిదాస్ కొలంబ్కార్, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే రెండ్రోజుల క్రితం అజిత్ పవార్‌పై సుప్రియా తీవ్రవ్యాఖ్యలు చేశారు. అజిత్ ఓ మోసగాడని, తాజా పరిణామాలతో కుటుంబంలో, పార్టీలోనూ చీలిక ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం ,రాజకీయాలకన్నా కుటుంబం ముఖ్యమని ,అజిత్ దాదా కం బ్యాక్ అని సుప్రియా సూలే ట్వీట్ చేశారు. పవార్ ను తిరిగి తాజా ఎన్నికల్లో కఠినశ్రమ, అంకితభావంతో తన తండ్రి యోధుడిలా పోరాడారని, శరత్ పవార్ పార్టీని నిలబెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.