మహారాష్ట్ర రాజకీయం రంజు మీద ఉంది. ఏమి చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.
శనివారం తెల్లవారుజామున రాష్ట్రపతి పాలన ఎత్తేయటం,మరో రెండు గంటల్లో దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ,NCP నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటం చక చకా జరిగిపోయాయి.
ఉదయం లేచి శివసేన నేత ఉద్దవ్ థాకరే కాబోయే ముఖ్యమంత్రి అని పత్రికలు రాసిన వార్త చదవకముందే ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అని ఎలక్ట్రానిక్ మీడియా వార్తను ప్రచారం చేసింది. ఏది నిజం ఏది అబద్దమో తెలుసుకోవటం కన్నా శరద్ పవార్ బీజేపీకి మద్దతు ఇచ్చారా?లేక అజిత్ పవర్ NCP ని చీల్చడా?మహారాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.
గంటల వ్యవధిలోనే శరద్ పవార్ తాను బీజేపీకి మద్దతు ఇవ్వలేదని ప్రకటించారు. గవర్నర్ ఫడణవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి,బల నిరూపణకు ఈ నెల 30 వరకు గడువు ఇవ్వటం అక్రమమని ఆదివారం శివసేన-NCP లు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. ఆదివారం,సోమవారం వాదనలు విన్న కోర్టు రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని ఈ ఉదయం తీర్పును ఇచ్చింది.
ఇదిలా ఉండగా,నిన్న సోమవారం మహారాష్ట్ర ఏసీబీ అజిత్ పవార్ మీద 2009-2014 మధ్య ఆయన మంత్రిగా ఉండగా సాగునీటి ప్రాజెక్టులలో 70,000 కోట్ల అవినీతి జరిగిందని నమోదయిన కేసులలో తొమ్మిది కేసులను విరమించుకుంది. ఈ కేసులలో అజిత్ పవార్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అందుకే కేసులు ఉప సంహరించుకున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అజిత్ పవార్ మీద కేసులు ఉపసంహరించుకోవటానికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఏసీబీ అధికారులు ప్రకటించారు.
ఈ దేశంలో అన్ని రాజ్యాంగబద్దంగా ,చట్టం ప్రకారమే జరుగుతాయి.. కాకుంటే అధికార పక్షానికి అనుకూలమైన,అవసరమైన సమయంలోనే జరుగుతాయి. కేంద్రంలో కానీ ,రాష్ట్రాలలో కానీ ఎలాంటి రాజకీయ సందర్భంలేకుండా విపక్ష నాయకుల మీద ఒక్కసారన్నా ఒక్క కేసన్న ఏసీబీ విరమించుకుందా?
హర్యానాలో JJP పార్టీ మద్దతు ఇవ్వటం దుశ్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి కావటం ,ఆయన తండ్రి అజయ్ సింగ్ చౌతాలా పెరోల్ మీద బయటకు రావటం ,ఇప్పుడు అజిత్ పవార్ మీద ఏసీబీ కేసులు ఉపసంహరించుకోవటం … న్యాయబద్దమే కాకుంటే రాజకీయ న్యాయ అని చదువుకోవాలి.
చంద్రబాబు కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన సుజనా చౌదరి,సీఎం రమేష్ లాంటి నేతలు టీడీపీ ఓటమి తరువాత బీజేపీలో ఎందుకు చేరారో సులభంగా అర్ధం చేసుకోవచ్చు.