iDreamPost
android-app
ios-app

మాగంటి బాబు ఇంట మరో విషాదం, మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు వారసుల మరణం

  • Published Jun 02, 2021 | 1:41 AM Updated Updated Jun 02, 2021 | 1:41 AM
మాగంటి బాబు ఇంట మరో విషాదం, మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు వారసుల మరణం

ఏలూరు మాజీ ఎంపీ, రాజకీయంగా కీలక కుటుంబానికి చెందిన మాగంటి బాబు ఇంట విషాదం అలముకుంది. మూడు నెలల వ్యవధిల ఆయన ఇద్దరు కుమారులను వివిధ కారణాలతో కోల్పోయారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. మాగంటి బాబు రాజకీయ వారసుడిగా కొంత చొరవగా కనిపించిన మాగంటి రాంజీ గత ఏడాది చివరిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే ప్రస్తుతం మరో తనయుడు కూడా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది. ఇంతటి కష్టంలో ఉన్న కుటుంబానికి ఓదార్పు దక్కాలని అంతా కోరుకుంటున్నారు.

మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ మంగళవారం రాత్రి హోటల్ పార్క్ హయత్ లో విగతజీవిగా పడిఉండడం కలకలం రేపింది. పూర్తి కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:మాగంటి బాబు ఇంట విషాదం

మాగంటి రవీంద్రకు పలు దురలవాట్లు ఉండడంతో వాటి నుంచి విముక్తి కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. అయితే రవీంద్ర మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి హైదరాబాద్ బంజారాహిల్స్ లో ని పార్క్ హయత్ హోటల్ లో దిగినట్టు చెబుతున్నారు. అక్కడే ఆయన రక్తపు వాంతులు చేసుకుని అచేతనగా పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన బంధువులు అపోలో ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు.

మాగంటి బాబు తల్లి, తండ్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, మాగంటి వరలక్ష్మి కూడా ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పాటు చక్రం తిప్పారు. రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలుకుబడి ఉన్న కుటుంబం. వారి వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాబు కూడా రాణించారు. వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వివాదాస్పద స్థితిలో ఆయన వైదొలగాల్సి రావడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో ఏలూరు నుంచి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. 2019లో ఓటమి పాలయ్యారు. సినీరంగంలోనూ వారికి ప్రవేశం ఉంది. గతంలో నుంచి పలు హిట్ సినిమాలను ఎంఆర్సీ బ్యానర్ పై నిర్మించారు.

రాజకీయంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే మాగంటి బాబు కుటుంబంలో స్వల్ప వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోవడం తీరని లోటు. ఆయనకు మరో కుమార్తె ఉన్నారు. మాగంటి బాబు కి ఎదురయిన ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కాలని అంతా కోరుకుంటున్నారు. పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఏలూరు వాసులు ఆయనకు సానుభూతి ప్రకటించారు.