iDreamPost
android-app
ios-app

పవన్ సార్.. మీరు మారిపోయారు సార్! మాదాసు గంగాధరం లేఖాస్త్రం

  • Published Apr 12, 2021 | 4:03 AM Updated Updated Apr 12, 2021 | 4:03 AM
పవన్ సార్.. మీరు మారిపోయారు సార్! మాదాసు గంగాధరం లేఖాస్త్రం

తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేనకు ఆ పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జానసేనానికి పంపిన మూడు పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాల్లో పవన్ తీరును ఆక్షేపించారు. టీడీపీతో అంతర్గత చెలిమి, బీజేపీతో పొత్తు వంటి అంశాల్లో ఏకపక్షంగా, గుంభనంగా వ్యహరిస్తుండటాన్ని తప్పు పట్టారు. పార్టీలో ఏకస్వామ్యం నడుస్తోందని.. పవన్ తీరు మొదటికి, ఇప్పటికీ పూర్తిగా మారిపోయిందంటూ.. ఈ పరిస్థితుల్లో సీనియర్లు ఇమడలేక ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మాదాసు పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) కన్వీనర్ గా, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అటువంటి నేత పార్టీపైనా, అధ్యక్షుడి తీరుపైనా ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ జనసేనలో కలకలం రేపుతోంది.

టీడీపీతో రహస్య స్నేహం

తొలి నుంచీ తెలుగుదేశం పట్ల పవన్ కళ్యాణ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయాన్ని మాదాసు ప్రస్తావించారు. వాటిని ఖండించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మౌనాన్నే అర్థాంగీకారంగా అందరు భావిస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న విషయం చివరి వరకు పార్టీలో ఎవరికీ తెలియదని, అలాగే ఎన్నికల అనంతరం వామపక్షాలను దూరం చేసి బీజేపీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిందని గంగాధరం ప్రశ్నించారు. ‘మీరు పోటీ చేసిన గాజువాక పరిధిలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకున్నా ఎందుకు ప్రశ్నించడంలేదని’ నిలదీశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా స్పష్టమైన హామీ పొందలేకపోయారని ఎత్తి చూపారు. వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర సంస్థ అయిన సీబీఐ దర్యాప్తు చేస్తుండగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకోగలదని అంటూ.. అయినా పవన్ మాత్రం టీడీపీ లైనులో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని ఆక్షేపించారు.

పార్టీలో ఏకస్వామ్యం

జనసేన ఏర్పాటైన తొలినాళ్లలో ప్రతినెలా క్రమం తప్పకుండా పీఏసీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేవారమని మాదాసు గుర్తుచేశారు. అయితే ఇటీవలి కాలంలో అవేవీ లేకుండా పోయాయన్నారు. మునుపటి పవన్ తీరు పూర్తిగా మారిపోయిందని.. పార్టీపై శ్రద్ధ తగ్గడంతోపాటు ఒక వ్యక్తికి పెత్తనం కట్టబెట్టారని ఆరోపించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి లేదన్నారు. ప్రాథమిక సభ్యత్వాలు, గ్రామ కమిటీలు లేకుండా క్రియాశీల సభ్యత్వాలు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పవన్ సూచన ప్రకారం తాను, మరో నేత రామ్మోహనరావు ఉత్తరాంధ్రలో విస్తృతంగా నెలరోజులు పర్యటించి పార్టీ అధ్యక్షుడికి నివేదిక ఇచ్చిన విషయాన్ని తన లేఖలో మాదాసు ప్రస్తావించారు. అయితే పార్టీలో పెత్తనం చేస్తున్న వ్యక్తి ఆ నివేదికను పక్కన పెట్టి ఉత్తరాంధ్ర నాయకులను వ్యక్తిగతంగా పిలిచి సమావేశాలు పెట్టారని.. అలాంటప్పుడు తమను ఎందుకు పంపించి నివేదిక ఇప్పించుకున్నారని ప్రశ్నించారు. సీనియర్ నేతలను పార్టీ నుంచి బయటకు పంపే యత్నాలు జరుగుతున్నాయని అంటూ పరోక్షంగా నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేశారు.

సినిమా వేరు.. రాజకీయం వేరు

సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని మాదాసు తన లేఖలో పేర్కొన్నారు. సినిమాల మాదిరిగా పార్టీని నడపడం కుదరదని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటైనప్పటినుంచి లక్షలాది కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. పార్టీ కోసం కష్టపడటానికి సిద్ధమయ్యారని.. అయితే ఇంతవరకు కమిటీలు లేవు.. అసలు సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టడంలేదని గంగాధరం విమర్శించారు. రాష్ట్రంలోని ఓ బలమైన సామాజికవర్గంతో పాటు బీసీలు పార్టీపై పెట్టుకున్న ఆశలపై పవన్ తన తీరుతో నీళ్లు చల్లారని ఆరోపించారు. పార్టీని మీ ఇష్టం వచ్చినట్లు నడుపుకునే అధికారం మీకుండవచ్చుగానీ.. అది ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా తానున్నప్పటికీ.. 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేకుండా పోయిందన్నారు. అయినా సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న అపవాదు భరించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా పార్టీలో తన ప్రమేయం అసలు లేదని.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నానని మాదాసు గంగాధరం తన లేఖలో పేర్కొన్నారు.