అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల ప్రకటన కంటే చాలా ముందే గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ రంగంలోకి దిగి హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు ప్యానెల్ సభ్యులు వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా లెట్టి ఎన్నికల్లో దిగారు.
అంత పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు..అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 11 మంది ఈసీ మెంబెర్స్ గెలిచారు. కానీ ఏమైందో ఏమో ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకాష్ ప్యానెల్ తరపున గెలిచిన 11మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపు నుండి శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మరో ఎనిమిది మంది విజయం సాధించారు. అయితే వారంతా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది..అప్పుడే ప్రకాశ్ అండ్ కో రాజీనామాలపై స్పందించిన విష్ణు.. వారి రాజీనామాలను స్వీకరించేది లేదని మీడియా ముఖంగా చెప్పారు. ఓటమి బాధలో నిర్ణయం తీసుకున్నారనీ వారు కూడా మాతో కలిసి పని చేయాలని కోరారు. అయితే రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని ఈ రోజు విష్ణు ప్రకటించారు.
అయితే ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయగా వాళ్ల రిజైన్లను మాత్రం ఆమోదించలేదనీ విష్ణు పేర్కొన్నారు. వీరి స్థానంలో మంచు విష్ణు తనకు నచ్చిన అభ్యర్థులను ఎంచుకున్నారు. మా బై లాస్ ప్రకారం ఆ అధికారం అధ్యక్షుడికి కలదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సజావుగా నడవడానికి గానూ వాళ్ళను ఎన్నుకున్నాము అని మంచు విష్ణు వెల్లడించారు. ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ వివరాలు వెల్లడించారు.