బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువడింది. లక్నోలో ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెలువరించింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేల్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కీలక తీర్పు ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తు వ్యూహం ప్రకారం జరగలేదని న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ కేసులో విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెలువరించింది.
కేసులో మొత్తం నిందితులు 49 మంది కాగా, కేసు విచారణలో ఉండగానే మరణించిన వారు17 మంది. మిగిలిన 32 మందిలో కోర్టుకు 27 మంది నిందితులు హాజరయ్యారు. ఐదుగురు నిందితులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకాలేకపోయారు. వారిలో అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, కల్యాణ్‌సింగ్, నృత్యగోపాల్‌దాస్, ఉమాభారతి ఉన్నారు. బాబ్రీమసీదు కుట్ర పూరితంగా కూల్చివేతే జరిగింది అనడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. దాంతో నిందితులంతా నిర్దోషులని పేర్కొన్నది.