iDreamPost
android-app
ios-app

‘లూసిఫర్‌’ రికార్డు స్థాయి స్పీడుతో.!

‘లూసిఫర్‌’ రికార్డు స్థాయి స్పీడుతో.!

రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా సినిమాలకు దూరమైన చిరంజీవి, మళ్ళీ సినిమాల్లోకొచ్చి చేసిన సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’. ఆ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత మరో సినిమా చేయడానికి చిరంజీవి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు. అలా చేసిందే ‘సైరా నరసింహారెడ్డి’. నిజానికి ‘సైరా నరసింహారెడ్డి’ కథకి వున్న ‘గ్రాండ్యూర్‌’ కారణంగా అంత సమయం తీసుకోవడం సమంజసమే. అయితే, ‘ఆచార్య’ సినిమా కోసం మళ్ళీ అంత సమయం పడుతుండడం వెనుక చాలా కారణాలున్నాయి. ఇక, ఇప్పుడు చిరంజీవి తదుపరి సినిమా మాత్రం రికార్డు స్థాయి స్పీడుతో తెరకెక్కబోతోందట. అదే ‘లూసిఫర్‌’ రీమేక్‌. త్వరలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోందనీ, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందనీ తెలుస్తోంది. వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. వినాయక్‌ దర్శకత్వంలో సినిమా అంటే చిరంజీవికి వుండే కంఫర్ట్స్‌ వేరు. దాదాపుగా సినిమా డైరెక్షన్‌ అంతా చిరంజీవి కనుసన్నల్లోనే జరుగుతుంది.

పైగా, చిరంజీవిని ఎలా ఎలివేట్‌ చేయాలో వినాయక్‌కి చాలా బాగా తెలుసు. అన్నిటికీ మించి చిరంజీవి వేవ్‌లెంగ్త్‌ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సినిమా రూపొందించడంలో వేగం చూపిస్తాడు వినాయక్‌. అయితే, వినాయక్‌ ఈ మధ్య వరుస పరాజయాలు చూశాడు. కానీ, అలాంటి లెక్కల్ని వినాయక్‌ విషయంలో అస్సలేమాత్రం పట్టించుకోరు చిరంజీవి. అందుకు వినాయక్‌తో చిరంజీవి చేసిన గత చిత్రాలు.. ఆ సమయంలో వినాయక్‌ గ్రాఫ్‌.. ఇవన్నీ నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ‘లూసిఫర్‌’ అనేది మలయాళ సినిమా. దాన్ని తొలుత ‘సాహో’ డైరెక్టర్‌ సుజీత్‌తో చేద్దామని చిరంజీవి అనుకున్నా, అనూహ్యంగా ఈక్వేషన్‌ మారింది.