పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు చేస్తున్నవారికీ.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి.. గుర్తింపునివ్వడంలో తన తర్వాతే ఎవరైనా అని సీఎం జగన్ తన చేతలతో ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికలో అదే పంథా అనుసరించారు. సామాజిక సమీకరణలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూనే.. నమ్మిన వారికి అవకాశాలు కల్పించారు. విశాఖ జిల్లా పరిధిలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో ఒకదానికి బీసీ మహిళ కోటాలో పార్టీ నాయకురాలు వరుదు కల్యాణిని ఎంపిక చేశారు.
రాజకీయ, సేవా కుటుంబం
వరుదు కల్యాణి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు. ఆమె తండ్రి స్వర్గీయ వరుదు బాబ్జీ ల్యాండ్ లార్డ్, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త. సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. 1999లో ప్రముఖ దేవస్థానం అరసవల్లి సూర్య దేవాలయాన్ని సుమారు రూ.40 లక్షలతో జీర్ణోద్ధరణ చేశారు. మొదట్లో తెలుగుదేశంలో ఉన్న ఈ కుటుంబం.. తర్వాత వైఎస్సార్సీపీలో చేరింది. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరసవల్లి దేవస్థానానికి ప్రత్యేక సలహామండలిని ఏర్పాటు చేసి.. అధ్యక్షుడిగా బాబ్జీని నియమించారు.
Also Read : Ycp,MLC ఫలించిన వంశీకృష్ణ నిరీక్షణ
బాబ్జీ కుమార్తె అయిన కల్యాణి కూడా మొదట తెలుగుదేశం ద్వారానే రాజకీయాల్లో ప్రవేశించారు. 2001 పరిషత్ ఎన్నికల్లో సారవకోట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో.. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. శ్రీకాకుళం అసెంబ్లీ సమన్వయకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అనుకున్నా.. ధర్మాన ప్రసాదరావు కు అవకాశం ఇచ్చారు.
విశాఖ కేంద్రంగా పార్టీకి సేవలు
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించకపోయినా కల్యాణి నిరుత్సాహపడలేదు. అయితే తన కార్యక్షేత్రాన్ని విశాఖకు మార్చారు. తన భర్త సొంతూరు విశాఖ జిల్లా చోడవరం కావడంతో కొన్నేళ్లుగా విశాఖలో ఉంటున్న ఆమె ఆ జిల్లా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జిగా కూడా పనిచేశారు. జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఆయనతోపాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఎటువంటి పదవులు లేకపోయినా నమ్మకంతో కొనసాగుతున్న ఆమెకు పార్టీ అధ్యక్షుడే గుర్తించి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.
Also Read : Monditoka Arun Kumar- అరుణ్ అంకిత భావానికి జగన్ బహుమతి..