iDreamPost
iDreamPost
గోవాలో గట్టెక్కేశారు. మిజోరాంలో ప్రత్యర్థులను మింగేశారు. కర్ణాటకలో కథ నడిపించేశారు. కానీ మహారాష్ట్ర మాత్రం మింగుడుపడలేదు. చివరకు దేవేంద్ర ఫడ్నవిస్ చేతులెత్తేయాల్సి వచ్చింది. అజిత్ పవార్ మీద అవినీతి కేసులు ఎత్తేసినా ఆశలు పండలేదు. ఆరునూరైనా అధికారం నిలబెట్టుకోవాలని చూసినా సీన్ మారిపోయింది. చివరకు సభలో బలం నిరూపించుకోలేక బీజేపీ తన బేలతనం ప్రదర్శించింది.
వరుసగా ఉదయం నుంచి మహారాష్ట్ర పరిణామాలు వేగంగా మారాయి. తొలుత బలనిరూపణ విషయంలో రేపు సాయంత్రం వరకూ గడువు ఇస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు వెలువడింది. ఆ వెంటనే ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేసేశారు. దాంతో ఇక బీజేపీ ఆటలు సాగేలా కనిపించలేదు. అయినా సభలో బలపరీక్షకు సిద్ధపడుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈలోగా సీఎం ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. నాలుగు రోజుల తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హార్స్ ట్రేడింగ్ కు అవకాశం లేదని తేలడంతో చివరకు చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి ఎన్సీపీతో పాటు ఇతర పార్టీలను కూడా చీల్చి గట్టెక్కాలని చూస్తున్నట్టు బీజేపీ నేతల ప్రయత్నాలు స్పష్టం చేశాయి. అందుకు అనుగుణంగా చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనే చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా అజిత్ పవార్- శరద్ పవార్ తీరు మీద పలు సందేహాలు వ్యక్తమవయ్యాయి. కానీ 162 మంది ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించిన ప్రతిపక్షాల కూటమి చూసిన తర్వాత ఇక సభలో విశ్వాసం ఇక గగనమే అన్నట్టుగా బీజేపీ నేతలు భావించాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో చక్రం తిప్పుదామని ఆశించి చతికిలపడిన బీజేపీ బేలతనం బయటపడి, ముంబై రాజకీయాల్లో మొట్టికాయలు తినాల్సి వచ్చింది.
తాజా పరిణామాలతో చాణుక్యుడికి తొలిసారిగా చావు దెబ్బ తగిలిందనే అభిప్రాయం వినిపిస్తోంది. మోడీ-షా గుజరాత్ ద్వయానికి గట్టి ఎదురు దెబ్బగా అంతా భావిస్తున్నారు. .మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ అంటూ హడావిడి చేసిన కమలం పార్టీ గొంతులో వెలక్కాయపడ్డట్టుగా మహా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఫ్లోర్ మీద పరీక్ష కూడా ఎదుర్కోలేక వెనుదిరిగిన కమల సర్కారు పతనం కావడంతో బీజేపీ నేతల ఎత్తులన్నీ చిత్తయినట్టుగా చెప్పక తప్పదు. దేశంలోనే తమకు తిరుగులేదని, ఏది చేసినా చెల్లుతుందని భావించిన మోడీకి ఆర్థిక రాజధానిలో తొలిసారిగా ఎదురయిన పరాభవం చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్షాల ఐక్యతతో తలపట్టుకోల్పవాల్సి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అనుకున్నవన్నీ జరగవన్నట్టుగా ఆశించిన దానికి భిన్నంగా జరిగిన ఈ పరిణామాలు కేంద్రంలో అధికార పార్టీకి కొంత కుదుపుగానే భావించాలి.
145 మంది మద్ధతు ఉంటేనే పీఠం ఎక్కగలమని తెలిసినా కూడా సభలో కేవలం 105 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా కలిగిన బీజేపీ అనూహ్యంగా అర్థరాత్రి పరిణామాల తర్వాత అధికార పీఠం ఎక్కడమే సంచలనం. అదే మోడీ-షా గొప్పతనమన్నట్టుగా సాగించిన ప్రచారం చివరకు తేలిపోయింది. రాష్ట్రపతిపాలన తొలగించి తెల్లవారు 5.45 ని. ల సమయంలో తీసుకున్న నిర్ణయంతో ఫడ్నవిస్-అజిత్ పవార్ ప్రభుత్వం అంతే హఠాత్తుగా కూలిపోయింది. మీడియాకు కూడా సమాచారం లేకుండా ప్రమాణస్వీకారం తంతు ముగించిన నేతలకు ఈ వ్యవహారం పెద్ద చెంపపెట్టుగా మారింది. బీజేపీ అధిష్టానం నుంచి మహారాష్ట్ర గవర్నర్ వరకూ అందరూ తలో చేయి వేసి ప్రభుత్వవాన్ని నిలబెట్టినప్పటికీ మహారాష్ట్ర సభలో మెజార్టీ దక్కించుకోలేని పరిస్థితి ఎదురుకావడం అనూహ్యమే.
కేంద్రంలో అధికారాన్ని వినియోగించుకుని ముంబైలో అధికారం సంపాదిస్తే మిగిలిన పార్టీల మద్ధతు దానికదే లభిస్తుందని ఆశించారు. అందుకు తగ్గట్టుగా అన్ని రకాల అస్త్రాలు వినియోగించవచ్చని ఆశించినప్పటికీ శరద్ పవార్ వంటి ఉద్దండులు, ఉద్దవ్ ఠాక్రే వంటి భూమి పుత్రులు, కాంగ్రెస్ నేతల చేదోడు కలిసి బీజేపీ కి చేతులు కాల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. శివసేనను చీల్చాలని, ఎన్సీపీని తమ వైపు తిప్పుకోవాలని, కాంగ్రెస్ ని కొల్లగొట్టాలని వేసిన ఎత్తుల్లో ఏ ఒక్కటీ పారినట్టుగా లేదు. దాంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇప్పుడు బీజేపీ అన్ని విలువలకు తిలోదకాలు ఇచ్చిన తర్వాత అలాంటి స్థితికి చేరింది.
పలు చిన్న రాష్ట్రాల్లో సాగించిన తన మార్క్ రాజకీయాలను మోడీ-షా ఇక్కడ చెల్లించుకోలేకోవడం వెనుక ముంబై కార్పోరేట్ వ్యవహారాలు కూడా తోడయినట్టుగా భావిస్తున్నారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పలు కార్పోరేట్ యజమానులు మోడీ తీరుతో సంతృప్తిగా లేరని, అలాంటి నేతలంతా కలిసి ఇప్పుడు ముంబై కేంద్రంగా మోడీకి చెక్ పెట్టేందుకు సహకరించినట్టు అంచనా వేస్తున్నారు. ఏమయినా తాజా పరిణామాల తర్వాత మోడీకి ఆర్ఎస్ఎస్ కేంద్రం నుంచి కూడా కొంత సహాయనిరాకరణ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత వేగంగా మలుపులు తిరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర చెబుతోంది..